తెలంగాణ

telangana

ETV Bharat / international

పోర్న్​స్టార్​తో వివాదం.. మాజీ లాయర్​పై​ ట్రంప్​ రూ.4 వేల కోట్ల పరువు నష్టం దావా - మైఖెల్​ కొహెన్​పై ట్రంప్​ పరువు నష్టం దావా

శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు రహస్యంగా డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్ వివాదంలో మరో కీలక పరిణామం జరిగింది. తనకు గతంలో వ్యక్తిగత న్యాయవాదిగా ఉన్న మైఖేల్‌ కొహెన్‌.. తనపై అసత్య ప్రచారాలు చేసి కాంట్రాక్టు ఉల్లంఘనకు పాల్పడ్డాడని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. ఈ క్రమంలోనే కొహెన్‌పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో ట్రంప్‌ రూ. 4 వేల కోట్ల పరువునష్టం దావా వేశారు.

Donald Trump defamation case on ex lawyer
Donald Trump defamation case on ex lawyer

By

Published : Apr 13, 2023, 10:45 PM IST

శృంగాతార స్టార్మీ డేనియల్స్‌ వ్యవహారంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే అరెస్టై విడుదలయ్యారు. స్టార్మీ డేనియల్స్‌కు రహస్యంగా డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న కేసులో ట్రంప్‌ కోర్టు గడపను తొక్కాల్సి వచ్చింది. అయితే ఈ వివాదంలో తాజాగా మరో కీలక పరిణామం జరిగింది. గతంలో తన వ్యక్తిగత న్యాయవాదిగా ఉన్న మైఖేల్‌ కొహెన్‌ తనపై అసత్య ప్రచారాలు చేసి కాంట్రాక్టు ఉల్లంఘనకు పాల్పడ్డాడని డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. తనకు నష్టాన్ని కలిగించినందుకు దాదాపు రూ. 4 వేల కోట్ల రుపాయలు చెల్లించాలని కోరుతూ ఫ్లోరిడా ఫెడరల్‌ కోర్టులో దావా వేశారు.

శృంగాతార స్టార్మీ డేనియల్స్‌తో డొనాల్డ్‌ ట్రంప్‌ అనైతిక ఒప్పందం చేసుకున్నారన్న కేసులో మైఖేల్‌ కొహెన్‌ కీలక సాక్షిగా ఉన్నారు. అయితే, ట్రంప్‌నకు కొహెన్‌ వ్యక్తిగత న్యాయవాదిగా ఉన్న సమయంలో జరిగిన అటార్నీ-క్లైంట్‌ సంభాషణలను రహస్యంగా ఉంచడంలో కొహెన్‌ విఫలమయ్యాడని ట్రంప్‌ ఆరోపించారు. పలు పుస్తకాలు, పాడ్‌కాస్ట్‌ సిరీస్‌, ఇతర మీడియాలో సంస్థల్లో తన గురించి బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేసి కొహెన్‌ కాంట్రాక్టు ఉల్లంఘనకు పాల్పడ్డారని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు.

కొహెన్‌ అనుచిత ప్రవర్తన తారస్థాయికి చేరుకోవడం వల్ల న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్ప ట్రంప్‌నకు మరో ప్రత్యామ్నాయం లేదని ట్రంప్‌ తరఫు న్యాయవాది వెల్లడించారు. న్యాయ విచారణతో పాటు ట్రంప్‌నకు జరిగిన నష్టానికి దాదాపు రూ. 4వేల కోట్ల రూపాయలను చెల్లించాలని దావాలో విన్నవించారు. మరోవైపు ట్రంప్‌ వేసిన వ్యాజ్యం నిరుపయోగమైందని కొహెన్‌ తరఫు న్యాయవాది లానీ డేవిస్‌ కొట్టిపారేశారు. మైఖేల్‌ కొహెన్‌పై బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతూ డొనాల్డ్‌ ట్రంప్‌ న్యాయవ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారని ఆయన ఆరోపించారు.

2006లో ట్రంప్‌, తాను ఓ కార్యక్రమంలో కలుసుకున్నామనీ, తరవాత హోటల్‌లో శృంగారంలో పాల్గొన్నామని స్టార్మీ డేనియల్స్‌ అనే శృంగార చిత్రాల నటి ఆరోపించారు. అక్రమ సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్‌ ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ట్రంప్‌ అధ్యక్షుడైన అనంతరం వచ్చిన ఆరోపణలతో న్యాయవాది కొహెన్‌ అరెస్టయ్యారు. ఈ కేసులో డేనియల్స్‌తో ఒప్పందంలో భాగంగానే తాను డబ్బు చెల్లించానని కొహెన్‌ అంగీకరించారు. దీంతో ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్‌ అభియోగం మోపాలని గ్రాండ్‌ జ్యూరీ నిర్ణయించింది. ఆయనపై చేసిన ఆరోపణలను సీల్డు కవరులో ఉంచారు. అందులో ట్రంప్‌పై 30 ఆరోపణలు ఉన్నట్లు సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ కథనం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details