Donald Trump Indicted : రహస్య పత్రాల తరలింపు కేసు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడకు చుట్టుకుంటోంది. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత శ్వేత సౌథం నుంచి వెళ్లిపోయేటప్పుడు.. రహస్య పత్రాలను ట్రంప్ తనతో తీసుకెళ్లారని ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. ట్రంప్‌పై నమోదైన నేరాభియోగాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ తీసుకెళ్లిన రహస్య పత్రాల్లో అమెరికా అణు కార్యక్రమ ప్రణాళికలు, అమెరికా సహా మిత్రదేశాలకు పొంచి ఉన్న సైనిక ముప్పు, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రచించిన ప్రణాళికల వంటి కీలక వివరాలు ఉన్నట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థకు ఓ దేశం మద్దతిస్తున్నట్లు ఉన్న ఆధారాలను సైతం ట్రంప్ తీసుకెళ్లిన రహస్య పత్రాల్లో ఉన్నాయని సమాచారం. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ సహా ఇతర నిఘా సంస్థల నుంచి అందిన అనేక పత్రాలు అందులో ఉన్నట్లు అభియోగాల్లో ఉంది.
ఇరాన్‌పై దాడికి సంబంధించిన అత్యంత రహస్యమైన ప్రణాళికలను 2021 జూన్‌లో ట్రంప్ న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన ప్రైవేట్ పార్టీకి హాజరైన అతిథులతో పంచుకున్నారని నేరాభియోగాల్లో పేర్కొన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమనీ. దీన్ని అత్యంత రహస్య సమాచారం కింద వర్గీకరించామని కూడా ట్రంప్ అందరి ముందూ అంగీకరించినట్లు వెల్లడించారు. 2021 సెప్టెంబరులో అమెరికా మిలిటరీకి చెందిన ఓ కీలక మ్యాప్‌ను ట్రంప్ తన పొలిటికల్ యాక్షన్ కమిటీలోని ఓ అనధీకృత వ్యక్తితో పంచుకున్నట్లు తెలిపారు. అలాంటి సమాచారం తెలుసుకునే అర్హత సదరు వ్యక్తికి లేదని, పైగా అతడికి సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా లేదని అభియోగాల్లో వెల్లడించారు.