Donald Trump Fund Raising :అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందం భారీగా నిధులు సేకరిస్తోంది. ఆయన.. జార్జియా జైలుకు వెళ్లి విడుదలైనప్పటి నుంచి 7.1 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 58 కోట్ల నిధులను సేకరించగలిగినట్లు ట్రంప్ బృందం ప్రకటించింది. జైలుకు వెళ్లి మగ్‌షాట్ నమోదైన కూడా ఇంత భారీగా నిధులు సమకూరుతుండటం గమనార్హం. నేరారోపణలు, ఫుల్టన్ కౌంటీ జైలులో లొంగిపోవడం నేపథ్యంలో గత మూడు వారాల్లో ట్రంప్ 20 మిలియన్ డాలర్లు నిధులు సేకరించారు. జార్జియాలో ట్రంప్‌ను అరెస్టు చేసిన తర్వాత ఒక్క రోజులో 4.8 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించారని.. ఇది మొత్తం అతడి ప్రచారంలోనే అత్యధికమైన సంఖ్య అని అమెరికా మీడియా ఒక నివేదికలో పేర్కోంది.
ట్రంప్ మగ్షాట్కు ఫుల్ గిరాకీ..
ఎన్నికల ప్రచారానికి ట్రంప్ ఈ మగ్‌షాట్‌ను (Donald Trump Mugshot) ఉపయోగించుకుని సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. మగ్‌షాట్ గురించి చెప్పిన ట్రంప్.. ఏ తప్పూ చేయనప్పుడు విచారణ ఎదుర్కోవడం అసౌకర్యంగా ఉంటుందన్నారు. అటు ట్రంప్ మగ్‌షాట్‌తో ఉన్న టీ షర్టులు, మగ్‌లు, కూజీలు అమెరికా మార్కెట్‌లో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.