Donald Trump Election Case : 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర చేశారన్న కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన అభియోగాలను కొట్టివేయాలని రిపబ్లికన్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫెడరల్ జడ్జ్ తన్యా చుకుతాన్ తిరస్కరించారు. మాజీ అధ్యక్షుడి హోదాలో ఎలాంటి రక్షణలు ఉండవని, ఈ కేసులో విచారణ ఎదుర్కొవాల్సిందేనని జడ్జ్ రూలింగ్ ఇచ్చారు. పదవిలో ఉన్నప్పుడు మాత్రమే దర్యాప్తు, నేరారోపణ, విచారణ, అభియోగాల నమోదు, దోషి, ఏదైనా నేరపూరిత చర్యలకు సంబంధించి శిక్ష విధించే విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుందని జడ్జ్ పేర్కొన్నారు.
ఈ కేసు విచారణ మార్చిలో జరగనుండగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. అమెరికా అధ్యక్ష హోదాలో తీసుకున్న నిర్ణయమైనందున.. విచారణ నుంచి మినహాయిస్తూ ఈ కేసును కొట్టివేయాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ఈ తీర్పు నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడి అధికారాల పరిధిపై న్యాయ పోరాటానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఈ తీర్పును ట్రంప్ న్యాయవాదులు అప్పీల్ చేసే అవకాశం ఉంది.