Donald Trump Disqualified :మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని భావిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమ రాష్ట్రంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్ నిలవకుండా ఇటీవల కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించగా తాజాగా మరో రాష్ట్రం ఆయనపై వేటు వేసింది. ప్రైమరీ బ్యాలెట్ పోరు నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు మైన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. కొలరాడో కోర్టు తీర్పుపై రిపబ్లికన్ పార్టీ అమెరికా ఫెడరల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వేళ ఈ పరిణామం జరగడం గమనార్హం.
కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మైన్ రాష్ట్రంలో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాల్ చేశారు. వారి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సెక్రటరీ షెన్నా బెల్లోస్ ట్రంప్ పేరును ప్రైమరీ బ్యాలెట్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్తర్వులపై ట్రంప్ కోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. అప్పటిదాకా ఆదేశాల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపారు. బెల్లోస్ నిర్ణయాన్ని రిపబ్లికన్ పార్టీ, మైన్ రాష్ట్ర కోర్టుల్లో సవాల్ చేయనుంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరును ఓ ఎన్నికల అధికారి ఇలా బ్యాలెట్ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలో ట్రంప్ ఓడిపోయినప్పుడు బైడెన్‌ను అడ్డుకోవడానికి 2021 జనవరి 6న రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి దిగారు. వారిని ట్రంప్ సమర్థించారని, హింసను ప్రేరేపించారన్న అభియోగాలపై ఇటీవల కొలరాడో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దేశాధ్యక్ష పదవికి ఆయన అనర్హుడని తేల్చింది.