Donald Trump Civil Fraud Case :అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మరోసారి గెలవకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రాజకీయ ప్రేరణతోనే తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. సుమారు 370 మిలియన్ డాలర్ల పరువునష్టం కేసులో విచారణ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తమకే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్పైనా ట్రంప్ విరుచుకుపడ్డారు. న్యూయార్క్ అటార్నీ జనరల్‌తో కలిసి తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"ఆర్థిక లావాదేవీలు సరిగ్గా ఉన్నాయి. అవినీతి జరిగినట్లు ఆధారాలు లేవు. 40 రోజులుగా సాగిన విచారణలో మాకు వ్యతిరేకంగా ఒక్కరూ కూడా సాక్ష్యం చెప్పలేదు. బ్యాంకులు ఇచ్చిన నగదును వారికి తిరిగి చెల్లించాం. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులు నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నేను మళ్లీ గెలవకూడదని ఇదంతా చేస్తున్నారు. మీరు పరిధులు దాటి వెళ్లి దీనిపై విచారించాలి. రాజకీయ జోక్యంతోనే ఇది నడుస్తోంది. అసలు విచారణ సమయంలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఆయన వినడానికి ఇష్టపడని నిజాలను చెబుతాను కదా."
--డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు