తెలంగాణ

telangana

ETV Bharat / international

'కట్నం వద్దు.. పెళ్లి చేసుకోండి.. పిల్లల్ని కనండి'.. కొత్త జంటలకు చైనా బంపర్​ ఆఫర్ - చైనాలో కైలీ సంప్రదాయం

కొన్నేళ్ల క్రితం చైనా ప్రవేశపెట్టిన వన్​ఛైల్డ్​ పాలసీ కారణంగా ఆ దేశంలో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. దీంతో అప్రమత్తమైన చైనా.. వధువు కుటుంబానికి సొమ్ములిచ్చే పద్ధతులకు స్వస్తి చెప్పి.. పెళ్లిళ్ల సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంది. జననాల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతుంది.

decreased population in China
decreased population in China

By

Published : Mar 8, 2023, 8:15 PM IST

జనాభా పెంచేందుకు చైనా అవస్థలు పడుతోంది. జననాలరేటు గణనీయంగా తగ్గిపోవడం వల్ల అప్రమత్తమైన డ్రాగన్ సర్కార్.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెళ్లి సమయంలో వధువు కుటుంబానికి.. వరుడు సొమ్ము ఇచ్చే సంప్రదాయానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. చైనాలో వరుడికి ఉన్న ఆస్తులను వధువు కుటుంబం వద్ద ప్రదర్శించడానికి.. ఆమెను పెంచినందుకు కొంత సొమ్ము ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని అక్కడ 'కైలీ' అని పిలుస్తారు. ప్రస్తుతం చైనాలో జరిగే మూడొంతుల పెళ్లిళ్లలో ఈ కైలీ సంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఈ కైలీని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం యత్నించినా సరే ఫలితం లేకపోయింది. కానీ జననాల రేటు పడిపోతుండటం వల్ల మళ్లీ దీన్ని అడ్డుకట్ట వేసే చర్యలకు ఉపక్రమించింది.

చైనా గతంలో వన్‌ఛైల్డ్‌ పాలసీని తీసుకువచ్చిన సమయంలో.. ఈ కైలీ విధానం అమల్లోకి వచ్చింది. ఈ పాలసీ కారణంగా చైనాలో పురుషుల సంఖ్య గణనీయంగా పెరిగి.. స్త్రీలు తగ్గిపోవడం వల్ల వధువు కుటుంబీకులు భారీస్థాయిలో సొమ్మును ఆశించడం మొదలుపెట్టారు. ఓ వైపు దేశంలో ఆర్థిక మందగమనం కారణంగా పెళ్లిళ్లు ఖరీదుగా మారిపోయాయి. ఇప్పటికే అక్కడ చాలా తక్కువ మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దీనికి కైలీ ఓ కారణమని భావిస్తున్న అధికారులు.. సెంట్రల్‌ హుబే ప్రావిన్స్‌లో కైలీ విధానం అమలు చేసేవారిపై జనవరి నుంచి చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటుగా జింగ్సి నగరంలో కొందరి యువతుల చేత కైలీ అడగబోమని సంతకాలు కుడా తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జింగ్షూ ప్రావిన్స్‌లో సామూహిక వివాహాలు జరిపించారు.

జననాల రేటు పెంచేందుకు చైనాలో కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు. పిల్లలు కనేవారికి సబ్సిడీలు, పెళ్లిళ్లకు అదనపు సెలవులు ఇస్తున్నారు. వీటితోపాటు పెళ్లిచేసుకోని జంటలు తమ సంతానాన్ని రిజిస్టర్‌ చేసుకొనే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. అయితే ఈ నిర్ణయాలు పురుషులకు అనుకూలంగా ఉన్నాయని.. స్త్రీలకు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు జిన్‌పింగ్‌ సర్కారు యత్నిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తొలిసారిగా తమ జనాభా తగ్గినట్లు చైనా ప్రకటించింది. 2021 కంటే 2022 చివరినాటికి జనాభా 8.50 లక్షలు తగ్గిందని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌-ఎన్​బీఎస్​ తెలిపింది. 95.6 లక్షల జననాలు, 1.04 కోట్ల మరణాలతో చైనా మొత్తం జనాభా 141.18 కోట్లుగా ఖరారు చేశారు. ఇందులో 72.2 కోట్లమంది పురుషులు, 68.97 కోట్ల మంది మహిళలు ఉన్నారు. హాంకాంగ్‌, మకావ్‌ భూభాగాలతోపాటు స్థానికంగా ఉంటున్న విదేశీయులను పరిగణనలోకి తీసుకుండా కేవలం చైనా ప్రధాన భూభాగంలోని వారినే లెక్కించారు.

ABOUT THE AUTHOR

...view details