తెలంగాణ

telangana

ETV Bharat / international

అవినీతి నేతలపై జిన్​పింగ్ ఉక్కుపాదం.. ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష - అవినీతి జిన్​పింగ్ ఉక్కుపాదం

అవినీతికి పాల్పడిన అధికారులు, రాజకీయ నేతలకు చైనా కఠినశిక్షలు విధిస్తోంది. రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరు మంత్రులు, ఓ అధికారికి మరణదండన ఖరారు చేసింది. అవినీతిపరులపై ఉక్కుపాదం మోపుతున్న జిన్‌పింగ్ పదవీకాలం ఈ ఏడాది చివరికి ముగియనుంది.

CHINA EX MIN DEATH PENALTY
CHINA EX MIN DEATH PENALTY

By

Published : Sep 24, 2022, 11:26 AM IST

అవినీతికి పాల్పడే వారిపై చైనా సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరు మాజీమంత్రులకు ఉరిశిక్ష విధించింది. 2012లో పీఠం ఎక్కినప్పటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న జిన్‌పింగ్‌.. అప్పటినుంచి అధికారులు, రాజకీయ నేతలకు కఠినశిక్షలు అమలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరికి అధ్యక్షుడిగా పదవీ కాలం పూర్తికానున్న నేపథ్యంలో జిన్‌పింగ్‌ కీలక అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న అధ్యక్షులంతా గరిష్ఠంగా పదేళ్లు అధికారంలో ఉండగా.. ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి మరోసారి అధికారపగ్గాలు నిలబెట్టుకోనున్నారు.

అవినీతికి పాల్పడేవారు సొంత పార్టీనేతలైనా జిన్‌పింగ్ ఉపేక్షించటం లేదు. ఇప్పటికే న్యాయశాఖ మాజీమంత్రిసహా మరో అధికారికి రెండ్రోజులక్రితం మరణశిక్ష విధించగా.. నిన్న మరో మాజీమంత్రికి ఉరిశిక్ష ఖరారు చేశారు. లంచం తీసుకోవడం, స్టాక్‌ మార్కెట్లలో అవకతవకలు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నట్లు నిరూపితం కావడంతో చైనా మాజీ ప్రజా భద్రతా ఉప మంత్రి సన్ లిజున్‌కు మరణశిక్ష విధించారు. సన్‌ లిజున్‌ తన జీవితకాలం రాజకీయ హక్కులను కోల్పోయారని... ఆయన సొంత ఆస్తులను జప్తు చేస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ కేసులో ఐదుగురు మాజీ పోలీసు ఉన్నతాధికారులకు ఇటీవలె జైలుశిక్ష విధించగా... సన్‌ లిజున్‌కు తాజాగా శిక్ష పడింది. గత ఐదేళ్లలో చైనా భద్రతా యంత్రాంగంలో అతిపెద్ద ప్రక్షాళన ముగింపు దశకు చేరుకుందని నివేదికలు తెలిపాయి. 2001 నుంచి 2020 ఏప్రిల్ వరకు వివిధ స్థాయిల్లో పనిచేసిన లిజున్‌... రూ.750కోట్లకుపైగా డబ్బు, బహుమతులు స్వీకరించినట్లు విచారణలో వెల్లడైంది. 2018 తొలి అర్ధభాగంలో స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ను లిజున్ ప్రభావితం చేశారని కోర్టు తెలిపింది. వీటితో పాటు అక్రమంగా రెండు తుపాకులను కలిగి ఉన్నట్లు పేర్కొంది.

అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు నిజమని తేలడంతో చైనా న్యాయశాఖ మాజీ మంత్రి ఫు జెంగ్‌హువాకు, నేరగాళ్లతో కుమ్మక్కు అయినందుకు మాజీ అధికారి వాంగ్‌లైక్‌కు చాంగ్‌చున్‌ కోర్టు గురువారం మరణశిక్షలు విధించింది. వీటి అమలును రెండేళ్లపాటు నిలిపివేసినట్లు ప్రకటించింది. నేరుగా లేదా బంధువుల ద్వారా సుమారు రూ.139 కోట్ల బహుమతులు, డబ్బు తీసుకున్నారని జెంగ్‌హువాపై వచ్చిన ఆరోపణలు నిరూపితమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details