Covid Vaccine Fourth Dose: కొవిడ్ వ్యాక్సిన్ నాలుగో డోసు తీసుకోవడం సురక్షితమేనని, దీని వల్ల శరీరంలో యాంటీబాడీ స్థాయిలు గణనీయంగా పెరిగి, రోగ నిరోధక వ్యవస్థ శక్తిమంతంగా మారుతుందని బ్రిటన్ పరిశోధకులు గుర్తించారు. నాలుగో డోసు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. యూకే వ్యాప్తంగా కరోనా ముప్పు తీవ్రంగా ఉన్నవారికి ఫైజర్, మోడెన్నా కొవిడ్ 19 టీకా నాలుగో డోసును అందిస్తున్నారు. 'స్ప్రింగ్ బూస్టర్' పేరుతో అందిస్తున్న ఈ డోసు సురక్షితమేనా? దీని వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి? అన్ని విషయాలపై 'ఎన్ఐహెచ్ఆర్ సౌతాంష్టన్ క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీ' పరిశోధన సాగించింది.
ఫైజర్, ఆస్ట్రాజెనికతా కొవిడ్ మూడో డోసు తీసుకున్న 166 మందికి అప్పటికి సరిగ్గా ఏడు నెలల తర్వాత ఫైజర్ టీకా పూర్తి డోసు లేదా మోడెర్నా టీకా సగం డోసుఇచ్చారు. టీకా కారణంగా కలిగే సాధారణ దుష్ప్రభవాలు తప్ప, తీవ్ర స్థాయి ఇబ్బందులేవీ వీరిలో తలెత్తలేదని నిపుణులు ధ్రువీకరించారు. కొవిడ్ ముప్పు తీవ్రంగా ఉన్నవారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి నాలుగో డోసుతో కొవిడ్ నుంచి శక్తిమంతమైన రక్షణ కల్పిస్తున్నట్లు ఎన్ఐహెచ్ఆర్ టీకా కార్యక్రమం అధిపతి ప్రొఫెసర్ ఆండ్రూ ఉస్తియా నోవస్కీ చెప్పారు.