Myanmar Aung San Suu Kyi : అక్రమంగా మాదక ద్రవ్యాలు తరలిస్తున్న వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మయన్మార్ కీలక నేత ఆంగ్ సాన్ సూకీని దోషిగా నిర్ధరించి జైలు శిక్ష విధించింది ఆ దేశ కోర్టు. అయితే ఇప్పటికే పలు కేసుల్లో ఆమె దోషిగా నిర్దరణ అయిన నేపథ్యంలో సూకీ జైలు శిక్షను 26 ఏళ్లకు పొడిగించింది.
కొన్నేళ్ల క్రితం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న మాంగ్ వీక్ అనే వ్యాపారవేత్త దగ్గర భారీగా లంచం తీసుకున్నట్లు సూకీపై కేసు నమోదైంది. ఆ కేసుపై విచారణ చేపట్టిన మయన్మార్ కోర్టు.. బుధవారం సూకీ జైలుశిక్షను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తం 26 ఏళ్లు జైలులోనే.. సూకీకి మరో కేసులో శిక్ష - మయన్మార్ ఆంగ్ సాన్ సూకీ కేసులు
మయన్మార్ కీలక నేత, నోబెల్ విజేత ఆంగ్ సాన్ సూకీ జైలు శిక్షను 26 ఏళ్లకు పొడిగించింది ఆ దేశ కోర్టు. డ్రగ్స్ తరలిస్తున్న వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూకీని ఆ కేసులో దోషిగా నిర్ధరించిన కోర్టు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీకి చెందిన సూకీ భవిష్యత్తు.. ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారింది. 2023లో ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సైన్యం హామీ ఇచ్చినా.. సూకీ జైలు శిక్షతో ఆ ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నట్లు స్పష్టమవుతోంది. 2020 జనరల్ ఎన్నికల్లో సూకీ పార్టీ విజయం సాధించింది. అయితే 2021 ఫిబ్రవరి ఒకటో తేదీన సూకీ పార్టీ నుంచి అధికారాన్ని సైన్యం లాగేసుకుంది. ఎన్నికల సమయంలో హెచ్చు స్థాయిలో అవకతవకలు జరిగినట్లు సూకీపై ఆరోపణలు వచ్చాయి. అయితే సూకీతో పనిచేసిన మాజీ సీనియర్ సభ్యుల్ని ఈ కేసులో సైన్యం అరెస్టు చేసింది.