Hottest Kiss Guinness World Record : సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా.. ఏదైనా రికార్డు సరికొత్తగా, వింతగా ఉంటే దానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కుతుంది. తాజాగా కెనడాకు చెందిన దంపతులు.. 15 నిమిషాల 6.5 సెకన్లపాటు ముద్దు (Hottest kiss) పెట్టుకున్న ఘటన ఆ రికార్డ్స్‌లో నమోదైంది. ఇందులో ప్రత్యేకత ఏముందంటారా? అక్కడే ఉంది అసలు విషయం. అదేంటంటే?
అత్యంత ఘాటైన మిరపకాయ తిని..
ముద్దు పెట్టుకోవడానికి ముందు వారిద్దరు 'హెబనెరో పెప్పర్' తిన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయగా దీనికి పేరుంది. అలాంటి దాన్ని ఇద్దరూ తిని దాదాపు 15 నిమిషాలు ముద్దుపెట్టుకోవడం మామూలు విషయం కాదు కదా!.. అందుకే గిన్నిస్ రికార్డు నమోదైంది.
15వ పెళ్లిరోజు స్పెషల్‌గా..
కెనడాకు చెందిన మైక్, జామీ జాక్ దంపతులు ఈ ప్రయత్నంలో పాల్గొన్నారు. త్వరలో వారి వివాహ 15వ వార్షికోత్సవం రాబోతోంది. అందుకు గుర్తుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఘాటు ముద్దు పెట్టుకున్నారట. ప్రపంచంలోనే ఘాటైన పెప్పర్లు తిన్న రికార్డులు ఇదివరకే మైక్ పేరిట ఉన్నాయి. తన భార్యను సైతం రికార్డులో భాగం చేయాలనే ఉద్దేశంతో నెల రోజుల నుంచి ఆమెకు శిక్షణ ఇచ్చాడు.
మైక్, జామీ జాక్ దంపతులు ఈ ఘనతపై దంపతులు స్పందించారు. తమ రికార్డు పట్ల స్నేహితులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇది జామీకి తొలి ప్రపంచ రికార్డు కావడం వల్ల మరింత ఆనందపడుతున్నారని చెప్పారు. ఈ రికార్డుతో తాము ఆగిపోమని, త్వరలో భూట్ జోలోకియా చిల్లీ పెప్పర్ తిని సరికొత్త చుంబన రికార్డు నెలకొల్పుతామని వెల్లడించారు.
నీటి అడుగున లిప్‌కిస్‌తో గిన్నిస్ రికార్డు
Lip Kiss Guinness World Record : ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజు ఓ జంట వరల్డ్ రికార్డ్‌తో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకొంది. వాలంటైన్స్ రోజున ఏదైనా డిఫరెంట్‌గా చేయాలనుకున్న ఈ జంట.. ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిపోయింది. అయినా.. ఆ జంట చేసిన అంత ప్రత్యేకత ఏమిటా? అని ఆలోచిస్తున్నారా!.. వీరు చేసిందల్లా ముద్దు పెట్టుకోవడమే. అయితే, అందరిలా లవర్స్ డే రోజున వీళ్లేమీ సాదాసీదాగా ముద్దు పెట్టుకోలేదు. నీటి అడుగున 4 నిమిషాలకు పైగా ఊపిరి బిగపట్టి లిప్ కిస్ పెట్టుకున్నారు. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.