COP28 Modi Speech :2028లో భారత్‌లో కాప్-33 సదస్సును నిర్వహించాలని ప్రతిపాదించారు ప్రధాని నరేంద్ర మోదీ. దుబాయిలో జరుగుతున్న ప్రపంచ వాతావరణ సదస్సు (కాప్-28 సదస్సు)లో ప్రధాని మోదీ ప్రారంభ ప్రసంగం చేశారు. 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45 శాతం తగ్గించడమే భారతదేశ లక్ష్యమని ఆయన తెలిపారు.
శిలాజయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచాలని భారత్ నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు మోదీ. 2070 నాటికి నికర సున్నా లక్ష్యం దిశగా ముందుకు వెళ్తామని ప్రధాని చెప్పారు. వాతావరణ మార్పుల విషయంలో ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్‌కు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంపన్న దేశాలు సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
"భారత్ నేడు ప్రపంచం ముందు జీవావరణ శాస్త్రం, ఆర్థిక వ్యవస్థ మధ్య సమతుల్యతకు అద్భుతమైన ఉదాహరణను అందించింది. ప్రపంచంలోని 17శాతం జనాభాకు భారత్ నిలయంగా ఉన్నప్పటికీ, కర్బన ఉద్గారాల విడుదలలో 4 శాతం కంటే తక్కువగా ఉంది. NDC లక్ష్యాలను చేరుకునే మార్గంలో ఉన్న ప్రపంచంలోని కొన్ని ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటి."
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఏకైక దేశాధినేత మోదీనే!
మరోవైపు, ప్రధాని మోదీ అరుదైన గౌరవాన్ని పొందారు. కాప్ 28 సదస్సులో ప్రారంభ ప్రసంగం చేశారు. కాప్ సదస్సు అధ్యక్షుడు సుల్తాన్ అల్ జాబ్, UNFCC కార్యనిర్వాహక కార్యదర్శి స్టెమన్ స్టెయిల్తో కలిసి ప్రారంభ ప్లీనరీలో పాల్గొన్న ఏకైక దేశాధినేత మోదీనే.
దేశాధినేతలతో మోదీ మర్యాదపూర్వక భేటీలు!
ప్రపంచ వాతావరణ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ.. పలు దేశాల అధినేతలను మర్యాదపూర్వకంగా పలకరించారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో మోదీ సంభాషించారు. భారత్- బ్రిటన్ స్నేహం రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతుందని మోదీ ట్వీట్ చేశారు. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాతో మోదీ మాట్లాడారు. బహ్రెయిన్‌తో బలమైన, శాశ్వతమైన సంబంధాలను భారత్ ఎంతో విలువైనదిగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ అధ్యక్షులతోనూ ప్రధాని సంభాషించారు. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్‌తో మోదీ సమావేశమయ్యారు.
అంతకుముందు యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తో సరదాగా మాట్లాడారు. నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్టేతోనూ మోదీ భేటీ అయ్యారు. పలు దేశాధినేతలను పలకరించిన చిత్రాలను ప్రధాని ట్వీట్ చేశారు. కాప్ -28 సమావేశానికి ముందు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఫ్యామిలీ ఫొటో దిగారు. నవంబర్ 30న యూఏఈ అధ్యక్షతన దుబాయిలో ప్రారంభమైన కాప్-28 సమావేశాలు ఈనెల 12వ తేదీ వరకు జరగనున్నాయి.
'కాప్-27' సమావేశం నుంచి బయటికెళ్లిన రిషి సునాక్.. చెవిలో చెప్పిన కొద్దిసేపటికే!
వాతావరణ మార్పులను ఈసారైనా 'కాప్' కాస్తారా?