తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్‌లో నూనె, నెయ్యికి తీవ్ర కొరత.. మూడువారాలకే నిల్వలు! - pakistan oil reserves

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థానీవాసులను వంటనూనె ధరలు మరింత భయపెడుతున్నాయి. దిగుమతులు లేక నూనె, నెయ్యి నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వీటి ధరలు కొండెక్కే అవకాశముంది.

pakistan economic crisis
వంటనూనె

By

Published : Jan 7, 2023, 3:18 PM IST

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది పాకిస్థాన్‌ పరిస్థితి నానాటికీ మరింత దిగజారుతోంది. ఇప్పటికే చికెన్‌, గోధుమ పిండి ధరలు కొండెక్కగా.. తాజాగా మరిన్ని నిత్యావసరాల కొరత ఏర్పడింది. దిగుమతులు లేక.. వంటనూనె , నెయ్యి సరఫరాలు పడిపోయాయి. మరికొద్ది నెలల్లో రంజాన్ మాసం ప్రారంభం కానున్న వేళ.. సరఫరా పెంచకపోతే వీటి ధరలు మరింత పెరిగే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పాకిస్థానీలు వినియోగించే 90శాతం వంట నూనెకు దిగుమతులే ఆధారం. అయితే నిధుల కొరత కారణంగా వంటనూనెను దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. వంటనూనెను 'అత్యవసర వస్తువుల' జాబితా నుంచి తొలగిస్తున్నట్లు దేశంలోని కమర్షియల్‌ బ్యాంకులు.. దిగుమతులదారులకు సమాచారమిచ్చాయి. కస్టమ్స్‌ గోదాముల్లో 3,58,000 టన్నుల వంటనూనె ఉన్నప్పటికీ.. దాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు బ్యాంకులు లెటర్ ఆఫ్‌ క్రెడిట్స్‌, రిటైరింగ్‌ పత్రాలను క్లియర్‌ చేయట్లేదు. దీంతో దిగుమతి నిల్వలపై సర్‌ఛార్జ్‌, ఇతర రుసుములు పెరుగుతున్నాయి. మరోవైపు పాకిస్థానీ రూపాయి విలువ డాలర్‌ మారకంతో పోలిస్తే రోజురోజకీ క్షీణిస్తోంది. దీంతో దిగమతులు మరింత భారమవుతున్నాయి.

డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక వంటనూనె, నెయ్యి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే వీటి ధరలు లీటర్‌పై రూ.26 పెరిగాయి. బ్యాంకులు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ జారీ చేయకపోతే.. రాబోయే రోజుల్లో వీటి ధరలు లీటర్‌పై మరో రూ.15-20 పెరగొచ్చని వంటనూనె తయారీ, సరఫరాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమున్న స్టాక్‌ మరో మూడు నాలుగు వారాలకు మాత్రమే సరిపోతుంది. ఈలోగా దిగుమతులు క్లియర్‌ కాకపోతే ధరల మోత తప్పేలా కన్పించట్లేదని చెబుతున్నారు. మార్చి మూడో వారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఆ సమయంలో నూనె, నెయ్యికి 20-25శాతం అధిక డిమాండ్‌ ఉంటుంది. ఆలోగా సమస్యను పరిష్కరించాలని సరఫరాదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

చాలాకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ను గతేడాది వచ్చిన వరదలు మరింత దెబ్బకొట్టాయి. భారీ వరదలకు దేశంలో మూడోవంతు మునిగిపోయింది. దీనివల్ల ఎగుమతులు తగ్గి, ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగుమతులు తగ్గటంతో విదేశీమారక నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌ వద్ద విదేశీమారక నిల్వలు(5.5 బిలియన్‌ డాలర్లు) 3 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఖర్చులు తగ్గించుకునేందుకు ఆ దేశం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. ఇంధన పొదుపు కోసమని ప్రస్తుతం పాక్‌వ్యాప్తంగా విద్యుత్‌ వాడకంపై ఆంక్షలు విధించారు. దేశంలో సగం వీధిలైట్లను ఆపేశారు. అమెరికాలోని తమ పాత రాయబార కార్యాలయాలను కూడా అమ్మేసే స్థితికి పరిస్థితి దిగజారడం దయనీయకరం.

ABOUT THE AUTHOR

...view details