భారతీయులకు గుడ్ న్యూస్- బైడెన్ ఆమోదంతో ఇకపై..! - green cards rules removed
GreenCard: అమెరికా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు గుడ్‌న్యూస్. గ్రీన్‌కార్డు జారీపై ప్రస్తుతం ఉన్న పలు నిబంధనల్లో మార్పులు చేయనుంది అమెరికా ప్రభుత్వం. ఈ మేరకు అందుకు సంబంధించిన బిల్లును యూఎస్ కాంగ్రెస్ కమిటీ ఆమోదించింది.
GREENCARD
By
Published : Apr 8, 2022, 9:02 AM IST
|
Updated : Apr 8, 2022, 1:13 PM IST
GreenCard: గ్రీన్‌కార్డు జారీపై ప్రస్తుతం ఉన్న పరిమితులను తొలగించేలా అమెరికా కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇమ్మిగ్రెంట్ ఉద్యోగులకు సంబంధించి వారి దేశాలను బట్టి పరిమిత సంఖ్యలో (పెర్కంట్రీ క్యాప్) గ్రీన్‌కార్డులను జారీ చేసే పద్ధతిని తొలగించాలని ప్రతిపాదించింది. అంతేకాదు.. కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన పెర్కంట్రీ క్యాప్‌ను పెంచుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇది 7 శాతంగా ఉండగా దానిని 15 శాతానికి పెంచాలని సూచించింది. ఈ మేరకు ఈగల్ యాక్ట్ పేరుతో అమెరికా ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ బిల్లును 22-14 ఓట్లతో ఆమోదించింది. జ్యుడీషియరీ కమిటీ ప్రతిపాదించిన ఈ బిల్లు ప్రతినిధుల సభ, సెనేట్లలో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత దీనిని బిల్లును అధ్యక్షుడు జో బైడెన్ ఆమెదించాక చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లు అమలులోకి వస్తే అమెరికాలోని భారతీయులకు ముఖ్యంగా హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న వారు లబ్ధిపొందనున్నారు.
మరోవైపు హెచ్-4 వీసా ఉన్న వారు ఎలాంటి ప్రత్యేక అనుమతులు పొందకుండానే అమెరికాలో ఉద్యోగం చేసే హక్కును కల్పించాలని ప్రతిపాదించారు అక్కడి చట్టసభ్యులు. ఈ మేరకు ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు సహా ఇతర దేశాల వారికి లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న ఉద్యోగుల కొరతను దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లును ప్రతిపాదించినట్లు చట్టసభ్యులు తెలిపారు. హెచ్-1బీ, హెచ్-2ఏ, హెచ్-2బీ సహా హెచ్-3 వీసాలు ఉన్నవారి పిల్లలు, భాగస్వాములకు హెచ్-4 వీసాను జారీ చేస్తుంది అమెరికా ప్రభుత్వం.
అగ్రరాజ్యానికే మన విద్యార్థుల జై: అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 2021లో 12 శాతం పెరిగింది. అదే సమయంలో చైనా నుంచి వెళ్లినవారి సంఖ్య 8 శాతానికిపైగా తగ్గింది. ఈమేరకు అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో పలు అంశాలను వెల్లడించింది. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా నుంచి వచ్చినవారే అత్యధికం కాగా.. భారత్ తర్వాతి స్థానంలో ఉంది. "ఆసియా నుంచి వచ్చేవారిలో భారత్, చైనాల విద్యార్థులే కీలకం. 2020తో పోలిస్తే 2021లో చైనా నుంచి 33,569 మంది తగ్గగా, భారత్ నుంచి 25,391 మంది పెరిగారు" అని పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలివే..
భారతీయ విద్యార్థుల్లో 37% మంది మహిళలు. అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల్లో 71.9% చైనా, భారత్‌లకు చెందినవారే. మొత్తంగా ఆసియా నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 2020తో పోలిస్తే 34,781 తగ్గింది. దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, జపాన్‌ల నుంచి కూడా విద్యార్థుల సంఖ్య తగ్గింది.
అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల చేరికలపై కొవిడ్ మహమ్మారి ప్రభావం 2021లోనూ కొనసాగింది. సెవిస్ (స్టూడెంట్స్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) రికార్డుల ప్రకారం 2021లో మొత్తం ఎఫ్-1, ఎం-1 (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసా విద్యార్థుల సంఖ్య 12,36,748. ఇది 2020తో పోలిస్తే 1.2% తక్కువ.
224కి పైగా దేశాలు, ప్రాంతాల నుంచి ఎఫ్-1, ఎం-1 విద్యార్థులు అమెరికాకు వచ్చారు. 2021లో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధికంగా 2,08,257 (16.8%) మంది కాలిఫోర్నియాలో చేరారు.
2021లో ఉన్నత విద్యలో మొత్తం 11,42,352 మంది అంతర్జాతీయ విద్యార్థులు డిగ్రీలు పొందారు. ఇది 2020 (11,21,981) కంటే ఎక్కువ.