Congo Stampede :ఆఫ్రికా దేశమైన రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 37 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. బ్రజ్జావిల్లేలో గత వారం రోజులుగా సైన్యంలో ఖాళీగా ఉన్న 1,500 పోస్టుల భర్తీకి మిలిటరీ స్టేడియంలో నియామక ర్యాలీ జరుగుతోంది. ప్రతి రోజూ వందల సంఖ్యలో యువత నియామక ర్యాలీలో పాల్గొనేందుకు స్టేడియం బయట లైన్లలో వేచి చూస్తున్నారు. మంగళవారం ఊహించిన దాని కంటే పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్లను అదుపు చేయడం నిర్వాహకులకు సాధ్యం కాలేదు.
ఈ క్రమంలో వాళ్లంతా ఒక్కసారిగా స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 37 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 'నియామక ర్యాలీ చివరి రోజు కావడం వల్ల చాలా మంది ముందు రోజు నుంచే మిలిటరీ స్టేడియం బయట వేచి చూస్తున్నారు. వారిలో కొందరు సహనం కోల్పోయి.. బలవంతంగా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నాం' అని అధికారులు తెలిపారు.