Congo Flood Death Toll :కాంగోలోని సెంట్రల్ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 10 మందితో సహా 22 మంది మరణించారు. కనంగా జిల్లాలోని ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల అనేక ఇళ్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ప్రావిన్స్ గవర్నర్ జాన్ కబేయా వెల్లడించారు.
ఇంటి గోడ కూలిపోవడం వల్ల బికుకులో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారని కబేయా తెలిపారు. తొలుత వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 17గా గుర్తించామని చెప్పారు. మంగళవారం మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో గోడలు కూలిన ఘటనలో పలువురు మృతి చెందినట్లు వెల్లడించారు.
డిసెంబర్ తొలి వారంలో కూడా కాంగోలోని బుకావు ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 14 మంది మృతి చెందారు. మే నెలలో కురిసిన వర్షాల కారణంగా కాంగో దక్షిణా కివూ ప్రావిన్స్‌లో 400 మంది మరణించారు. కొండచరియలు భారీ విరిగిపడడం వల్ల భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. కాంగోలో తరచుగా వరదలు సంభవిస్తూనే ఉంటాయి.