తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ దేశాల్లో 'చిల్లీ' సాస్​కు ఫుల్​ డిమాండ్​.. కొవిడ్​ రోగులకు మంచి ఫుడ్​ అదే! - nutrients in chilli

అధిక ఉష్ణోగ్రతలు, కరవు కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో హాట్‌ చిల్లీసాస్‌కు కొరత ఏర్పడింది. దీంతో కీలకమైన ఈ ఆహార పదార్థాన్ని నిల్వ చేసుకోవడానికి ఎగబడ్డారు. ఎంత ఘాటుగా ఉన్నప్పటికీ ఆహారంలో మిర్చి తగలనిదే కొందరికి అనుభూతి ఉండదు. వాసన, రుచి సామర్థ్యాన్ని కోల్పోయే కొవిడ్‌-19 బాధితులు కూడా మిరప సాయంతో పూర్వవైభవాన్ని పొందే వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

information about chilli
మిర్చి

By

Published : Dec 26, 2022, 10:15 AM IST

మానవులు క్రీస్తుపూర్వం 7500 సంవత్సరం నుంచే ఆహారంలో మిర్చిని వాడుతున్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. మనుషులు మొదట సాగు చేసిన పంటల్లో ఇది కూడా ఒకటని విశ్లేషిస్తున్నారు. పురాతన వంట సాధనాలపై మిరప అవశేషాలు ఉన్నాయి.

ఎందుకంత ఘాటు?
మానవులు, ఇతర క్షీరదాలకు పుట్టుకతోనే మిరప రుచి పట్ల విముఖత ఉంటుంది. ఇందులోని క్యాప్సైసిన్‌ అనే పదార్థమే కారణం. ఇది మన చర్మం, కళ్లు, నోరు వంటి సున్నిత ప్రాంతాలను తాకగానే నొప్పి, మండుతున్న భావన కలుగుతుంది. అందువల్లే దీన్ని పెప్పర్‌ స్ప్రే వంటి ఆత్మరక్షణ ఆయుధాల్లో వాడుతున్నారు. మిరప.. సహజసిద్ధ నల్లమందుగా కూడా పనిచేస్తుంది. ఆహ్లాదకరమైన భావనలను కలిగించే ఎండార్ఫిన్లు విడుదల చేసేలా ఇది శరీరాన్ని ప్రేరేపిస్తుంది.

  • క్యాప్సైసిన్‌కు మనం ప్రతిస్పందించడానికి చర్మం, ముక్కు, గొంతులోని స్పర్శ నాడుల్లో ఉన్న టీఆర్‌పీవీ1 గ్రాహకాలే కారణం.
  • మిరపను కొరికినప్పుడు క్యాప్సైసిన్‌ మన నాలుక మీద విడుదలవుతుంది. దాని ఘాటుకు అప్పటికే ఎంతమేర అలవాటుపడ్డామన్నదాన్ని బట్టి ఫలితం ఉంటుంది. కొందరిలో ఈ బాధ స్వల్పంగానే ఉంటుంది. మరికొందరిలో అది నషాళానికి అంటి, కళ్ల నుంచి నీరు ఉబికి వస్తుంది.
  • క్యాప్సైసిన్‌ రేణువులు మన టీఆర్‌పీవీ1 గ్రాహకాలకు అంటుకుంటాయి. ఫలితంగా మెదడుకు సంకేతాలు వెళ్లి, ప్రతిస్పందన చర్యలు వెలువడతాయి.
  • ఈ గ్రాహకాలు క్యాప్సైసిన్‌తోపాటు అధిక ఉష్ణానికీ స్పందిస్తాయి. ఆహారం వేడిగా ఉన్నప్పుడు ఈ కాప్సైసిన్‌తో కలిగే ఘాటు మరింత పెరుగుతుంది. మన మెదడు దీన్ని అటు నొప్పిగాను, ఇటు మితిమీరిన వేడిగానూ అన్వయించుకుంటుంది. దీన్ని చల్లబరచడానికి తలలోని చర్మం నుంచి చెమట విడుదలవుతుంది.
  • జంతువుల దాడి నుంచి తమ ఫలసాయాన్ని రక్షించుకోవడానికే మిర్చి మొక్కలు క్యాప్సైసిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. పక్షులకు ఈ మిరపఘాటు నుంచి రక్షణ ఉంది. అందువల్ల అవి మిరపను తిని, తమ విసర్జితాల ద్వారా విత్తనాలను వ్యాప్తి చేస్తుంటాయి.

కొవ్వుతోనే కరుగుతుంది
ఉప్పు, తీపి, చేదు వంటి ఇతర ఫ్లేవర్లతో పోలిస్తే మిర్చి మిగిల్చే మంట, అనుభవం ఎక్కువసేపు కొనసాగుతాయి. నాలుకపై ఉన్న గ్రాహకాల నుంచి కాప్సైసిన్‌ రేణువులను నీటి సాయంతో తొలగించే వీలు లేకపోవడమే దీనికి కారణం. అవి కొవ్వులోనే కరుగుతాయి. ఘాటైన మిర్చితో కూడిన ఆహారం తినేటప్పుడు ముద్దముద్దకూ బాధ పెరుగుతుంది.

మిరప పచ్చగా ఉన్నప్పుడే ఎక్కువ ఘాటుగా ఉంటుంది. పండేకొద్దీ అందులో రసాయనాలు, విటమిన్లు వచ్చి చేరతాయి. ఫలితంగా మంట కొంచెం తగ్గుతుంది. కొన్ని మిర్చి రకాల్లో సి విటమిన్‌, బీటా కెరోటిన్‌ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా వాటిని కొరికినప్పుడు కొంత తీపి తగులుతుంది.

మిర్చి

అయినా ఎందుకు తింటున్నారు?

  • మిర్చి ఘాటుగా ఉన్నా కొందరు దాన్ని వదలరు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.
  • కాప్సైసిన్‌ తీవ్రత వల్ల నోట్లో లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా ఆహార వేడి తగ్గుతుంది. తిండిని బాగా నమిలి మింగడానికీ ఇది దోహదపడుతుంది. ఇది ఆహారంలోని ఇతర రుచులను కరిగించి, నాలుక నలుదిశలకూ వ్యాప్తి చేస్తుంది. ఫలితంగా ఆయా రుచులను బాగా ఆస్వాదించొచ్చు.
  • ఆహారాన్ని మింగేటప్పుడు మిర్చిలోని ఘుమఘుమలతో కూడిన కొన్ని పదార్థాలు నోటి లోపలి నుంచి పైకి ఎగసి, నాసిక మార్గంలోని సెన్సర్ల వరకూ వెళతాయి.
  • క్యాప్సైసిన్‌ ఘాటుకు స్పందనగా శరీరంలో ఎండార్ఫిన్లు ఉత్పత్తవుతాయి. అవి నొప్పి తెలియకుండా మొద్దుబార్చడం, ఆహ్లాదకరమైన భావనలను కలిగించడం వంటివి చేస్తాయి. తీవ్ర, సుదీర్ఘ వ్యాయామం అనంతరం కూడా ఇవి విడుదలై ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
  • కాప్సైసిన్‌కు గ్రాహకాలు బాగా అలవాటుపడటం వల్ల కూడా కొందరు మిర్చిని ఎక్కువగా తీసుకుంటారు.
    కోవిడ్

కొవిడ్‌.. రుచి..
కొవిడ్‌, కొన్నిరకాల యాంటీవైరల్‌ చికిత్సల వల్ల రుచి, వాసన సామర్థ్యం తాత్కాలికంగా తగ్గిపోతుంది. కొన్ని కేసుల్లో అది పూర్తిగా గల్లంతవుతుంది. అయితే కొంతకాలానికి ఇది పునరుద్ధరణకు నోచుకుంటుంది. కొందరిలో అందుకు ఎక్కువ సమయం పట్టొచ్చు. దీనివల్ల బాధితుల జీవన నాణ్యత తగ్గిపోతుంది.

  • ఈ నేపథ్యంలో భిన్న కొవిడ్‌ రకాలు.. మెదడులో వాసనకు సంబంధించిన సమాచారాన్ని ప్రాసెస్‌ చేసే ఆల్‌ఫ్యాక్టరీ న్యూరాన్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నది శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. కొన్నిరకాల నూనెలతో వాసనపై శిక్షణ ఇవ్వడం వంటివి చేస్తున్నారు.
  • రుచి సామర్థ్యాన్ని పెంచే సాధనంగా మిర్చి ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న 2వేల మందిపై వారు అధ్యయనం జరిపారు. రుచి బాగా తెలియడానికి వీలుగా 43 శాతం మంది తమ ఆహారంలో మిరప, ఇతర మసాలాల మోతాదును పెంచుతున్నట్లు వెల్లడైంది. రుచి భావనలను ప్రేరేపించడానికి మిరప వంటి ఆహారాలు సాయపడతాయని తేలింది.
  • ఇవీ చదవండి:
  • చైనాలో కొవిడ్‌ మరణ మృదంగం.. డ్రాగన్​ టీకాలపై సందేహాలు!
  • భారత్​లో చైనా చొరబాటు.. బంగారం కంటే విలువైన ఆ 'ఫంగస్‌' కోసమేనా..?

ABOUT THE AUTHOR

...view details