Columbia Plane Crash Survivors : ప్రపంచంలోకెల్లా దట్టమైన, భీకరమైన అరణ్యాలు... అమెజాన్ అడవులు. పొడవాటి చెట్లు.. ఒక్కసారిగా మారిపోయే వాతావరణం.. క్రూరమృగాలు ఇలా ఆ కీకారణ్యంలో ప్రతీ అడుగు ప్రాణాంతకమే. కానీ ఆ దండకారణ్యంలోనూ.. నలుగురు చిన్నారులు 40 రోజుల పాటు తమ ప్రాణాలను నిలుపుకున్నారు. ఏడాది వయస్సున్న చిన్నారిని కాపాడుకుంటూ ఆ చిన్నారులు చేసిన పోరాటం.. ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోంది. విమాన ప్రమాదంలో అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు సురక్షితంగా ఉన్నారని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రకటనతో.. ఆ దేశ ప్రజలు ఆనందంతో మునిగిపోయారు.
Columbia Plane Crash 2023 : అది మే ఒకటో తేదీ.. కొలంబియాలోని గౌవియారే ప్రాంతంలో దట్టమైన అమెజాన్ అటవీ ప్రాంతంలో ఓ విమానం కుప్పకూలింది. అందులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల అది నేల కూలబోతున్నట్లు పైలట్ ప్రకటించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాడార్ల పరిధి నుంచి ఆ విమానం వేరయింది. ఈ ప్రమాదంలో చిన్నారుల తల్లి, పైలెట్, గైడ్ మరణించగా.. 13, 11, 9 ఏళ్ల చిన్నారులతో పాటు ఏడాది వయసున్న పసికందు ప్రాణాలతో బయటపడ్డారు. పెద్దవాళ్లందరూ మరణించడం వల్ల.. ఏడాది వయసున్న పాపను కాపాడుకుంటూ ఈ ముగ్గురు చిన్నారులు.. ఆ దండకారణ్యంలో పోరాటం ప్రారంభించారు. పండ్లు, ఆకులు అలుములూ తింటూ అడవి నుంచి బయటపడేందుకు నడవడం ప్రారంభించారు. కానీ దిక్కు దారి తెలియక రోజుల తరబడి అడవిలోనే తిరుగుతున్నారు.