Colombian Plane Crash Children : దట్టమైన అమెజాన్ అడవిలో సంచరించాలంటే పెద్దవాళ్లకే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి చోట అభం శుభం తెలియని చిన్నారులు ఏకంగా 40 రోజుల పాటు మనుగడ సాగించారు. భయంకర విమాన ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు బాలలు.. అడవిలో దొరికే ఆకులు అలములు భుజిస్తూ, అమెజాన్ చిత్తడి నేలల్లోని నీటిని తాగుతూ ప్రాణాలు కాపాడుకున్నారు. వీరిలో 11 నెలల పసిబిడ్డ కూడా ఉంది. మిగతావారి వయసు 13, 9, 4 ఏళ్లు. ఇన్నిరోజుల తర్వాత వీరంతా అడవిలో సజీవంగా కనిపించడం ఒక అద్భుతం. అయితే వీరికి ఏ పండ్లు, ఏ ఆకులు తినాలో ఏవి తినకూడదో ఎలా తెలిసిందనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తల్లి గర్భంలో ఉండగానే
Colombian Plane Crash Survivors : అమెజాన్ అడవికి దగ్గరగా నివసించే చిన్నారుల కుటుంబానికి అడవి పట్ల జ్ఞానం ఉంటుందని అటవీ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. అది ఈ పిల్లలకు కూడా సహజంగానే వచ్చి ఉంటుందని అన్నారు. సరైన అవగాహన లేకపోయి ఉంటే తెలియకుండానే విషాహారాన్ని తీసుకుని ఉండేవారని పేర్కొన్నారు. తల్లి గర్భంలో ఉండగానే ప్రకృతి నుంచి చాలా విషయాలు ఈ బాలలు తెలుసుకుని ఉంటారని చెప్పారు. మరోవైపు క్రూరమృగాలు, విషపురుగులకు భయపడకుండా 40 రోజులు మనుగడ సాగించడమనేది ఓ అద్భుతమని అన్నారు.
జంతువులు తినే పండ్లు.. ఆకులపై పడ్డ నీళ్లు..
అనకొండలు, జాగ్వార్‌లు వంటి భయానక జీవుల బారిన పడకుండా ఈ చిన్నారులు బయటపడటం మామూలు విషయం కాదని పలువురు అంటున్నారు. అడవిలో మమేకమైన వారికే ఇది సాధ్యమని చెబుతున్నారు. తెలియకుండానే కోతులు వంటి కొన్ని జంతువులు వీరికి బతకడం నేర్పి ఉంటాయని అంటున్నారు. అవి తినే పండ్లనే వీరు కూడా తిని ఉంటారని.. ఆకులపై పడ్డ నీళ్లను తాగి ఉంటారని భావిస్తున్నారు. రాత్రి వేళ దోమలు, పాముల నుంచి కాపాడుకునేందుకు పొదల వంటి వాటిని వినియోగించి ఉంటారని చెబుతున్నారు.
అడవిలో 40 రోజులు ఉన్న చిన్నారులతో సైనికులు 'క్రూర మృగాలు ఉన్నా అడవే కాపాడింది'
విమాన ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చిన్నారులు కనిపించారని సహాయక చర్యలకు బాధ్యత వహించిన జనరల్ పెడ్రో శాంచెజ్ తెలిపారు. రెస్క్యూ టీమ్‌లు 20 నుంచి 50 మీటర్ల దూరంలో పిల్లలు ఉన్నప్పటికీ రెండు సందర్భాల్లో గుర్తించలేకపోయినట్లు చెప్పారు. అయితే క్రూర మృగాలు ఉన్నప్పటికీ అడవే వారిని కాపాడిందని పెడ్రో పేర్కొన్నారు. ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ అడవిలో బతకడానికి కావాల్సినవన్నీ ఉంటాయని అన్నారు. దాదాపు 150 మందికి పైగా సైనికులు, స్థానిక గిరిజనులు, జాగిలాలు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు వివరించారు. చిన్నారులు తిని పడేసిన ఆహారమే వారిని గుర్తించేందుకు మార్గం చూపిందని చెప్పారు.
అడవిలో 40 రోజులు ఉన్న చిన్నారులతో సైనికులు 40 రోజుల తర్వాత సేఫ్‌గా నలుగురు చిన్నారులు
Columbia Plane Crash 2023 : అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలోని ఆరారాక్యూరా నుంచి శాన్‌జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి మే ఒకటో తేదీన విమానం బయలుదేరింది. ఆ విమానంలో నలుగురు చిన్నారులు, వారి తల్లి, గైడ్, పైలట్ ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్యతో అది కూలబోతున్నట్లు పైలట్ ప్రకటించారు. అనంతరం ఆ విమానం రాడార్ నుంచి అదృశ్యమై ప్రమాదానికి గురైంది. విమానంలో పైలట్, తల్లి, గైడ్ మరణించగా.. చిన్నారులు మాత్రం 40 రోజుల పాటు అడవిలో ఉంటూ తమను తాము కాపాడుకున్నారు. ప్రస్తుతం నీరసంగా ఉన్న చిన్నారులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వారిని ఇటీవలే కలిసి ధైర్యం చెప్పారు.