Colombian Plane Crash Children : దట్టమైన అమెజాన్ అడవిలో తప్పిపోయి 40 రోజుల పాటు మనుగడ సాగించిన చిన్నారులు.. ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కొలంబియాలోని సైనిక ఆస్పత్రిలో క్రమంగా కోలుకుంటున్న చిన్నారులు.. ఆ భయానక రోజులను బంధువులు, వైద్యులతో పంచుకుంటున్నారు. విమానం కూలిపోయిన తర్వాత ఆ చిన్నారుల తల్లి నాలుగు రోజల పాటు బతికే ఉందని.. పిల్లలు చెప్పారని బంధువులు తెలిపారు. విమాన ప్రమాదంలో చిన్నారుల తల్లి తీవ్రంగా గాయపడిందని.. నాలుగు రోజుల పాటు కొన ఊపిరితో ఉందని వివరించారు. మరణించే ముందు ఈ అడవిని దాటి బయటకు వెళ్లాలని పిల్లలకు చెప్పిందని రానోక్ వివరించారు. విమాన ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తర్వాత.. తల్లి మరణంతో పిల్లలు అడవి నుంచి బయటపడేందుకు ప్రయాణం మొదలుపెట్టారని వెల్లడించారు.
అమెజాన్ కీకారణ్యంలో క్రూర మృగాలు, పాములు, దోమల నుంచి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు.. చెట్ల తొర్రల్లో దాక్కున్నామని చిన్నారులు తెలిపారు. రాత్రి వేళల్లో బిక్కుబిక్కుమంటూ గడిపామని వివరించారు. విమానంలో ఉన్న కొద్దిపాటి ఆహారంతో పాటు.. పండ్లు, ఆకులు తినడం, అడవిపై వారికి అవగాహన ఉండడం వల్ల చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అమెజాన్ చిత్తడి నేలల్లోని నీటిని తాగుతూ ప్రాణాలు కాపాడుకున్న చిన్నారులకు.. ఏ పండ్లు, ఏ ఆకులు తినాలో ఏవి తినకూడదో అనే విషయంపై అవగాహన ఉండడంవారి మనుగడకు కారణమైందని విశ్లేషిస్తున్నారు. 13, 9, 4, 11 నెలల వయస్సు ఉన్న పిల్లలు.. మరో రెండు వారాల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. చిన్నారులకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా ఆహారం తీసకుంటున్నట్లు వివరించారు.