పాకిస్థాన్ నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నినాదాలు వినిపించాయి. ఆయన్ను కీర్తిస్తూనో, విమర్శిస్తూనో కాదు. రాహుల్ గాంధీ భారత్లో ఇచ్చిన నినాదాన్ని పాకిస్థాన్లో నిరసనకారులు ఉపయోగించుకున్నారు.
ఏమైందంటే?:అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా ఆయన అనుచరులు పాకిస్థాన్లో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన షేక్ రషీద్.. పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో భారీ నిరసన సభ నిర్వహించారు. దీనికి వేలాది మంది తరలి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఆర్మీపై విమర్శలు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించినందుకు.. సైన్యాన్ని 'చౌకీదార్ చోర్ హై' (కాపలాదారుడే దొంగ) అని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. హోం శాఖ మాజీ మంత్రి అయిన షేక్ రషీద్.. నిరసనకారులను శాంతిపజేసేందుకు ప్రయత్నించారు. ఆర్మీపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని వారించారు. శాంతియుతంగా పోరాడదాం అంటూ పిలుపునిచ్చారు. 'చౌకీదార్ చోర్' నినాదాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరచుగా ఉపయోగించేవారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించేందుకు ఈ నినాదాన్ని 2019 ఎన్నికల సందర్భంగా ప్రయోగించారు రాహుల్.