XI Jinping Resign: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పదవి నుంచి తప్పుకోబోతున్నారని అక్కడి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కరోనా నిర్వహణలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా, చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి జిన్‌పింగ్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే ఆయనను చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) పక్కకు పెట్టబోతోందని వదంతులు వ్యాపిస్తున్నాయి. సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రచారం మొదలైంది. చైనా పాలనలో ఈ నాయకత్వ బృందమే అత్యంత కీలకం.
Jinping News: ఈ సమావేశం అనంతరం కెనడాకు చెందిన బ్లాగర్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ.. కొద్ది నెలల్లో కీలక సమావేశాన్ని నిర్వహిస్తుందని, ఆ లోపే జిన్‌పింగ్‌ను పదివి నుంచి తప్పుకోవాలని ఆదేశించిందని చెప్పాడు. అంతేకాదు ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్ను తదుపరి చైనా అధ్యక్షుడిగా పార్టీ నియమిస్తుందని పేర్కొన్నాడు. పార్టీ నుంచి, పదవి నుంచి జిన్‌పింగ్ వైదొలుగుతారని వివరించాడు.