China Rocket Crash: చైనా కొద్ది రోజుల క్రితం ప్రయోగించిన లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్‌కు సంబంధించిన భారీ శకలాలు భూకక్ష్యలోకి ప్రవేశించాయి. రాత్రి వేళ వివిధ రంగుల్లో మిరిమిట్లు గొలుపుతూ రాకెట్ శిథిలాలు భూమివైపు దూసుకొచ్చాయి. తూర్పు, దక్షిణాసియా ప్రాంతాల్లోని చాలా చోట్ల ప్రజలు వీటిని వీక్షించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీటిని ఉల్కాపాతంగా భావించి కొందరు వీడియోలు తీశారు.
శనివారం రాత్రి 10 గంటల 45 నిమిషాల సమయంలో హిందూ మహాసముద్రంపై ఇవి భూవాతావరణంలోకి ప్రవేశించాయి. అమెరికా స్పేస్ కమాండ్ కూడా ఇదే సమయంలో చైనా రాకెట్ శిథిలాలు భూ వాతావరణంలోకి చేరినట్లు నిర్ధరించింది. మలేసియా మీదుగా ఈ శకలాలు ప్రయాణిస్తున్న వీడియోను నాసా ఆస్ట్రోనాట్ క్రిస్ హాడ్‌ఫీల్డ్ కూడా షేర్ చేశారు. వీటిలో ఎన్ని భూమిని తాకి ఉండొచ్చనే సందేహం వ్యక్తం చేశారు.
చైనా స్పేస్ ఏజెన్సీ పనితీరును నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ తప్పుపట్టారు. చైనా తన రాకెట్ల శిథిలాలు భూ వాతావరణంలోకి రాకుండా అడ్డుకోలేకపోతోందని పేర్కొన్నారు. అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించే దేశాలు అత్యుత్తమ విధానాలను అనుసరించాలని సూచించారు. లాంగ్‌మార్చ్ 5బీ వంటి రాకెట్ల శిథిలాలు ఆస్తి, ప్రాణ నష్టం కలగజేసే ప్రమాదం ఉందన్నారు. నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్
China Long March 5B: చైనా తాను కొత్తగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోకి ఇటీవల లాంగ్ మార్చ్ 5బీ వాహనం ద్వారా తొలి ల్యాబ్ మాడ్యూల్ ప్రయోగించింది. ఆ తర్వాత రాకెట్ అనేక ముక్కలుగా విరిగిపోయింది. 30 మీటర్ల పొడవు, 21 టన్నుల బరువున్న ఈ రాకెట్ శిథిలాలు తాజాగా భూమి వైపునకు దూసుకొచ్చాయి. వాతావరణంలో పూర్తిగా కాలిపోయిన రాకెట్ అవశేషాలను పసిఫిక్ ప్రాంతంలోని సులు సముద్రంలో గుర్తించినట్లు చైనా అంతరిక్ష సంస్థ వెల్లడించింది.
ఇవీ చూడండి:మనం ఎందుకు నిద్రించాలి? జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయో తెలుసా?
రిషికి ఇక కష్టమే.. 10శాతానికి పడిపోయిన విజయావకాశాలు