మూత్రంలో రక్తం రావడం.. తరచూ కడుపు నొప్పి.. ఎన్నిసార్లు వైద్యులను సంప్రదించినా అతడి ఆరోగ్యం కుదుటపడలేదు. అపెండిక్స్ అయ్యుండొచ్చని వైద్యులు శస్త్రచికిత్స చేసినా.. ఫలితం లేదు. 33 ఏళ్లు వచ్చినా ఆ వ్యక్తిని ఆ బాధలు వేధిస్తుండటంతో.. పూర్తిస్థాయి పరీక్షలు చేసిన వైద్యులు రిపోర్టులు చూసి షాక్‌కు గురయ్యారు. అతడి కడుపు నొప్పి, రక్తస్త్రావానికి కారణం 'రుతుస్రావం' అని గుర్తించారు. ఆ వ్యక్తికి స్త్రీ సెక్స్ క్రోమోజోమ్‌లు ఉన్నట్లు కనుగొన్నారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. చైనాకు చెందిన లీ డాంగ్‌కు (పేరు మార్చాం) మూత్రవిసర్జన సమయంలో సమస్యలు ఏర్పడగా యుక్త వయసులో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే అప్పటి నుంచి లీకి.. మూత్ర విసర్జన సమయంలో రక్తం వస్తోంది. తరచూ కడుపునొప్పితో బాధపడేవాడు. గతంలో నాలుగు రోజులపాటు తీవ్ర పొత్తికడుపు నొప్పి వేధించడంతో వైద్యులు అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించారు. అయినా లాభం లేకుండా పోయింది. ఆ సమస్య అలాగే వెంటాడింది. దీంతో గతేడాది పూర్తిస్థాయిలో అతడిని పరీక్షించిన వైద్యులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఆ వ్యక్తికి స్త్రీ క్రోమోజోమ్‌లు ఉన్నాయని గుర్తించారు. రక్తస్రావం అనారోగ్యం కారణంగా జరుగుతోంది కాదని, అది రుతుస్రావం అని తేల్చారు. కడుపునొప్పికి కారణం కూడా ఇదేనని పేర్కొన్నారు.
లీ డాంగ్ పూర్తిస్థాయిలో పురుషుడు కాదని.. పురుష, స్త్రీ క్రోమోజోమ్ కలగలిసిన 'ఇంటర్‌సెక్స్' అని వైద్యులు వెల్లడించారు. లీకి గర్భాశయం, అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని వైద్య పరీక్షలో గుర్తించారు. పురుష సెక్స్ హార్మోన్ ఆండ్రోజెన్ స్థాయిలు సగటు కంటే తక్కువగా ఉన్నాయి. స్త్రీ సెక్స్ హార్మోన్లు, అండాశయ కార్యకలాపాల స్థాయిలు ఓ ఆరోగ్యకరమైన మహిళల మాదిరిగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని ఇంటర్‌సెక్స్‌గా డాక్టర్లు గుర్తించారు.