China Spy Ship: చైనా నిఘా నౌక యువాన్ వాంగ్-5 శ్రీలంక దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే లంక అధికారులు ఆ నౌక రాకను వాయిదా వేయాలని కోరారు. ఆ మాటలను చైనా వినిపించుకోవడంలేదు. అసలు ఈ నౌకను శ్రీలంకలోని హంబన్ టొట రేవులో లంగర్ వేసేందుకు తొలుత అనుమతి ఇవ్వడంపైనే భారత్ తీవ్రంగా స్పందించింది. దీంతో వెనక్కి తగ్గిన లంక.. యువాన్ వాంగ్ 5 ప్రయాణం వాయిదా వేయాలని డ్రాగన్‌ను కోరింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ నౌక ఇండోనేషియాకు ఉత్తర దిశగా గంటకు 26 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ రకంగా అయితే గురువారం ఉదయం 9.30 గంటలకు హంబన్‌టొట రేవుకు ఇది చేరుకొంటోంది.
భారత్ నుంచి శ్రీలంక అధికారులపై నిన్న తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీంతో వారు నిన్న కూడా చైనా దౌత్య అధికారులను పిలిపించి ఆ నౌక ప్రయాణాన్ని వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో చైనా అధికారులు భారత్ పేరు ప్రస్తావించకుండా ఓ ప్రకటన జారీ చేశారు. చైనా పరిశోధక నౌకను సాధారణ దృష్టితో చూడాలని కోరారు. శ్రీలంక-చైనా మధ్య సాధారణ సహకారాన్ని దెబ్బతీయవద్దని కోరారు.