China White Paper Protest: చైనాలో జీరో కొవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. తియానన్మెన్ స్క్వేర్ ఆందోళన తర్వాత ఇవే అతిపెద్ద నిరసనలు. చైనా కమ్యూనిస్టు పార్టీలో చాలా మంది నేతలు చదువుకున్న ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయంలో కూడా ఇవి చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రజలు తమ నిరసనలు తెలియజేయడానికి తెల్ల కాగితాలను గుర్తుగా ఎంచుకొన్నారు. దీంతో ఈ ఆందోళనలను 'తెల్లకాగితం ఆందోళనలు' లేదా 'ఏ4 విప్లవం'గా అభివర్ణిస్తున్నారు. చైనా ప్రభుత్వం కూడా ఈ ఆందోళనలను కఠినంగా అణచివేస్తోంది.
ఏ4 తెల్లకాగితాలు ఎందుకు..?
చైనాలో సాధారణంగా ఎటువంటి ఆందోళనలనైనా మొగ్గదశలోనే అణచివేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కానీ, వ్యక్తులను కానీ కించపర్చకుండా ఆందోళన చేయాలంటే తెల్లకాగితం ఉపయోగించడం ఒక్కటే మార్గం. దీంతోపాటు చైనాలోని సెన్సార్‌షిప్‌ను తెలియజేసేందుకు కూడా ఈ శ్వేతపత్రం గుర్తుగా ఉంటుంది. ఆందోళన సమయంలో వారు ఏమి తెలియజేయకుండానే విషయం అందరికీ తెలుస్తుంది. ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయంలో ఈ రకంగానే విద్యార్థులు నిరసన తెలిపారు. 2020లో హాంకాంగ్ ఆందోళనల్లో కూడా తెల్లకాగితాన్ని గుర్తుగా వినియోగించారు. ఇప్పుడు నేరుగా చైనాలోని ఆందోళనలకు వీటిని వాడటం అక్కడి ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పిస్తోంది.
సోషల్ మీడియాలో భారీగా సెన్సార్.. పేపర్ కంపెనీల షేర్ల పతనం..!
ఈ తెల్లకాగితం ప్రదర్శనలను సోషల్ మీడియా నుంచి మాయం చేయడానికి చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. చైనాలో టెక్ దిగ్గజాలైన టిక్‌టాక్, విబో వంటివి ఖాళీ తెల్లకాగితం చిత్రాలను తమ వేదికలపై నుంచి తొలగిస్తున్నాయి. ఈ ఉద్యమం ఎంతగా పెరిగిపోయిందంటే.. చైనాలో ఏ4 తెల్లకాగితాల విక్రయాన్ని ఆపేశారనే వదంతులు కూడా వ్యాపించాయి. ఫలితంగా అక్కడ ప్రముఖ స్టేషనరీ చైన్ స్టోర్ల సంస్థ 'ఎం అండ్ జీ స్టేషనరీ' షేర్లు 3.1శాతం పతనం అయ్యాయి.