China Village In Bhutan : పొరుగు దేశాల సరిహద్దులను అక్రమించేందుకు తీవ్రంగా యత్నిస్తున్న చైనా మరోసారి తన వక్రబుద్ధి బయటపెట్టింది. ఒకవైపు సరిహద్దు వివాదంపై భూటాన్‌తో అధికారికంగా చర్చలు జరుపుతోంది. మరోవైపు భూటాన్ భూభాగంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. తాజాగా భూటాన్‌లోని జకర్‌లుంగ్ వ్యాలీలో డ్రాగన్ అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది. ఈ మేరకు మాక్సర్ అనే సంస్థ శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది.
ఇళ్లు, సైనిక్ బ్యారెక్ల నిర్మాణం
China Constructions In Bhutan : అరుణాచల్ ప్రదేశ్‌కు 50 కిలోమీటర్ల దూరంలో భూటాన్ తూర్పు సరిహద్దు వెంబడి చిన్న చిన్న గ్రామాలను చైనా నిర్మిస్తున్నట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో నివాస భవనాలు, సైనిక్ బ్యారెక్‌లు, ఔట్‌పోస్టులను చైనా నిర్మిస్తున్నట్లు మాక్సర్ సంస్థ తెలిపింది. గత రెండేళ్లుగా ఆ ప్రాంతంలో చైనా తన ఉనికిని పెంచుకునేందుకు తీవ్రంగా యత్నిస్తుందని పేర్కొంది.
191 భవనాల నిర్మాణం
China Houses In Bhutan : గతవారం విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల్లో సరిహద్దు వెంబడి రెండు చోట్ల భవనాలను చైనా నిర్మిస్తున్నట్లు కనిపించినట్లు వెల్లడించింది. మొదటి ఎన్‌క్లేవ్‌లో దాదాపు 129 భవన నిర్మాణాలు కనిపించగా, కొద్ది దూరంలో ఉన్న రెండో ఎన్‌క్లేవ్‌లో మరో 62 భవనాలు కనిపించాయని తెలిపింది. భూటాన్ ప్రజలకు సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యం కలిగిన బేయుల్ ఖెంపాజోంగ్ ప్రాంతానికి అనుకుని ఉన్న జకర్‌లుంగ్ వ్యాలీలో చైనా అక్రమ నిర్మాణాలు చేపట్టడం కలవరపెడుతోంది.