తెలంగాణ

telangana

By

Published : Feb 15, 2023, 7:48 AM IST

ETV Bharat / international

చైనా బెలూన్​కు ఆత్మాహుతి సామర్థ్యం.. డ్రాగన్ మాటలపై ఎన్నో అనుమానాలు!

అమెరికా గగనతలంలో చైనా బెలూన్ సంచరించడం చర్చనీయాంశంగా మారింది. అది తమ దేశానికే చెందిన వాతావరణ బెలూన్ అని చైనా వాదిస్తోంది. బలమైన గాలుల వల్ల దారిమళ్లి అమెరికాలోకి వెళ్లిందని డ్రాగన్‌ చెబుతోంది. అయితే, ఆ బెలూన్ రోజుల తరబడి గాల్లో తిష్టవేయడం, సున్నితమైన ప్రాంతాలపై సంచరించడం అనుమానాలకు తావిస్తోంది.

chinese spy balloon shot down
chinese spy balloon shot down

కొద్దిరోజులుగా అమెరికా గగనతలంలో కల్లోలం! నింగిలో ఏదో వస్తువు కనిపించడం.. యుద్ధవిమానాలు రయ్‌మంటూ దూసుకెళ్లడం.. క్షిపణులతో వాటిని నేలకూల్చడం నిత్యకృత్యంగా మారింది. ఇప్పటివరకూ ఇలాంటి కూల్చివేతలు నాలుగు జరిగాయి. నేలకూలిన వస్తువుల్లో మొదటిది చైనా పంపిన బెలూన్‌ అని వెల్లడి కాగా.. మిగతా మూడింటిపై స్పష్టత లేదు. అమెరికాలో ఇప్పుడు దీనిపైనే చర్చ. తాము పంపిన బెలూన్‌ నిఘా అవసరాలకు ఉద్దేశించింది కాదని, అది వాతావరణ పరిశోధనలకు సంబంధించిందన్న చైనా మాటల్లోని డొల్లతనం క్రమంగా బయటపడుతోంది. ఆ ఎయిర్‌షిప్‌ను కూల్చిన ప్రదేశం నుంచి చెప్పుకోదగిన స్థాయిలో సెన్సర్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను గుర్తించినట్లు అమెరికా అధికారులు తాజాగా ప్రకటించారు. అది గూఢచర్యానికి ఉద్దేశించిందేనని ప్రాథమికంగా వెల్లడవుతోందని చెబుతున్నారు. తుది విశ్లేషణలోనూ ఇదే రుజువైతే రెండు దేశాల మధ్య వైరం మరింత పెరగనుంది.

  • ఏమిటీ బెలూన్లు?
    • నిఘా అవసరాల కోసం బెలూన్లను 18వ శతాబ్దం నుంచే వాడుతున్నారు. ఫ్రెంచ్‌ విప్లవ సమయంలో యుద్ధరంగ విహంగ వీక్షణం కోసం వాటిని ఉపయోగించారు.
    • రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యం బెలూన్ల ద్వారా అమెరికా భూభాగంపైకి బాంబులను జారవిడిచేది.
    • 1950ల్లో సోవియట్‌ యూనియన్‌ భూభాగంపైకి ఫొటోగ్రఫిక్‌ బెలూన్లను అమెరికా పంపింది. నిఘా ఉపగ్రహాల శకం మొదలయ్యాక ఇవి తగ్గిపోయాయి.

ఇప్పటికీ ఎందుకు అవసరం?
మెరుగైన నిఘా ఉపగ్రహాలు, విమానాలు, డ్రోన్లు వచ్చాక సైన్యంలో బెలూన్ల వినియోగం తగ్గింది. ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. ఉపగ్రహాల తయారీ, ప్రయోగానికి ఆధునిక పరిజ్ఞానం, లక్షల డాలర్లు అవసరం. వీటితో పోలిస్తే నిఘా బెలూన్లు చాలా చౌక. ప్రయోగం, నియంత్రణ కూడా సులువు. ఈ ఎయిర్‌షిప్‌లను నేరుగా నియంత్రించలేకపోవచ్చు. నింగిలో భిన్న ఎత్తుల్లో గాలుల దిశ, వేగం భిన్న రీతుల్లో ఉంటుంది. దీనికి అనుగుణంగా బెలూన్‌ ఎత్తును తగ్గించడం, పెంచడం ద్వారా లక్షిత ప్రాంతం వద్దకు దాన్ని పంపొచ్చు.
ఉపగ్రహాలు చాలా ఎత్తులో భూమి చుట్టూ వేగంగా పరిభ్రమిస్తుంటాయి. వీటితో పోలిస్తే నిఘా బెలూన్లు తక్కువ ఎత్తులో సంచరిస్తాయి. పైగా లక్షిత ప్రాంతంపై ఎక్కువసేపు ఉండి విస్పష్ట చిత్రాలను తీస్తాయి.

బెలూన్ ఊహాత్మక చిత్రం

గాలిమాటలేనా?
బలమైన వెస్టర్లీ గాలుల వల్ల దారిమళ్లిన తమ బెలూన్‌ అమెరికాలోకి వెళ్లిందని డ్రాగన్‌ చెబుతోంది. చైనా, ఉత్తర అమెరికా మధ్య ఉత్తర పసిఫిక్‌పైన తూర్పు దిక్కు నుంచి పశ్చిమం వైపునకు వీచే గాలులను వెస్టర్లీలుగా పేర్కొంటారు. ఇటీవల 30వేల నుంచి 40వేల అడుగుల ఎత్తు, ఆపైన భాగంలో గాలుల వేగం గంటకు 240 కిలోమీటర్లుగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సాధారణమేనని, చైనా చెబుతున్నట్లు అనూహ్య పరిస్థితులేమీ లేవని విశ్లేషిస్తున్నారు.

ఎన్నో అనుమానాలు...
వాతావరణ బెలూన్లు కొద్దిగంటల తర్వాత పేలిపోతాయి. వాటిలోని పరికరాలు పారాచూట్‌ ద్వారా నేలకు వస్తాయి. చైనా 'ఎయిర్‌షిప్‌' మాత్రం రోజుల తరబడి గాల్లో తిష్టవేయడం, సున్నితమైన ప్రాంతాలపై సంచరించడం అనుమానాలకు తావిస్తోంది.

'రాప్టర్‌'కే ఆ సామర్థ్యం
చైనా బెలూన్‌, ఆ తర్వాత మరో రెండు అనుమానిత వస్తువుల కూల్చివేతకు ఖరీదైన ఎఫ్‌-22 రాప్టర్‌ యుద్ధవిమానాన్ని అమెరికా ఉపయోగించింది. దీని ధర 30 కోట్ల డాలర్లు. అది గంటపాటు గగనవిహారం చేయడానికి ఏకంగా 68వేల డాలర్లు ఖర్చవుతుంది. ఈ యుద్ధవిమానం 4 లక్షల డాలర్ల విలువైన ఏఐఎం 9ఎక్స్‌ సైడ్‌వైండర్‌ క్షిపణులను ప్రయోగించి, అనుమానిత వస్తువులను ధ్వంసం చేసింది. ఇంత చిన్న పనికి అంత ఖరీదైన జెట్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దీనికి నిపుణుల సమాధానమిదీ..

ఎఫ్22 యుద్ధ విమానం

బెలూన్‌, మరో రెండు గుర్తుతెలియని వస్తువులు చాలా ఎత్తులో విహరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికా అమ్ములపొదిలో ఉన్న యుద్ధవిమానాలన్నింటిలోకీ అత్యధిక ఎత్తుకు చేరగలిగే సామర్థ్యం ఎఫ్‌-22కు మాత్రమే ఉంది. చైనా బెలూన్‌ కూల్చివేత కోసం ఇది 58వేల అడుగుల ఎత్తుకు వెళ్లి, క్షిపణిని ప్రయోగించింది. ఆ సమయంలో బెలూన్‌ 60వేల నుంచి 65వేల అడుగుల ఎత్తులో ఉంది. మిగతా రెండు వస్తువులు 40వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నాయి. నాలుగో వస్తువును కూల్చివేయడానికి ఎఫ్‌-16 యుద్ధవిమానాన్ని అమెరికా ఉపయోగించింది. ఆ వస్తువు నేలపై 20వేల అడుగుల ఎత్తులో ఉండటమే ఇందుకు కారణం.

కీటకంలా కనిపిస్తుంది..
ఎఫ్‌-22 రాప్టర్‌ ఐదో తరం స్టెల్త్‌ యుద్ధవిమానం. అధునాతన సెన్సర్లు, ఆయుధ వ్యవస్థలు దీని సొంతం. ఇది శత్రువులను ఏమార్చగలదు. దీని రాడార్‌ క్రాస్‌ సెక్షన్‌ (ఆర్‌సీఎస్‌) 0.0001 చదరపు మీటర్లు. అంటే.. ఒక చిన్న కీటకంలా రాడార్‌ తెరపై కనిపిస్తుంది.

శకలాలు ఏం చెబుతాయి?
చైనా ఎయిర్‌షిప్‌ పొడవు 60 మీటర్లని, ఒక టన్ను లోడును అది మోసుకెళ్లగలదని ప్రాథమిక విశ్లేషణలో తేలింది. వీటిలో దాదాపు 40 అడుగుల పొడవైన యాంటెన్నా కూడా ఉంది. స్వాధీనం చేసుకొన్న శకలాల బరువు మొత్తం 2,000 పౌండ్లు. వీటిని విశ్లేషిస్తే ఏదైనా కీలక సమాచారం, డేటా చైనాకు వెళ్లిందా అన్నది అమెరికా గుర్తించగలుగుతుంది.

  • పెద్ద యాంటెన్నా, ప్రొపెల్లర్లు, ఇతర కమ్యూనికేషన్‌ సాధనాలు లభ్యం కావడాన్ని బట్టి ఆ బెలూన్‌ను రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో నియంత్రిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
  • ప్రత్యర్థి నుంచి దాడి ఎదురైనప్పుడు.. సాధనాల్లోని సాఫ్ట్‌వేర్‌, అవి సేకరించిన డేటా నాశనమయ్యేలా డ్రాగన్‌ ఏర్పాట్లు చేసుకొని ఉండొచ్చన్న విశ్లేషణలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైనా అందులోని పరికరాలను విశ్లేషించి, అవి ఎంత రిజల్యూషన్‌తో, నాణ్యతతో చిత్రాలు తీశాయన్నది గుర్తించొచ్చు.
  • ఈ బెలూన్‌ హైబ్రిడ్‌ ఉపగ్రహ నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఉంటుందా అన్నది డేటా విశ్లేషణలో స్పష్టమవుతుంది. ఈ విధానంలో బెలూన్లు.. తాము సేకరించిన సమాచారాన్ని సమీపంలోని ఉపగ్రహానికి పంపుతాయి. ఆ తర్వాత వాటిని శాటిలైట్లు భూ కేంద్రానికి పంపుతాయి. విదేశాల్లో చైనాకు ఇలాంటి కేంద్రాలు అనేకం ఉన్నాయి.
  • ఈ బెలూన్‌కు 'ఆత్మాహుతి సామర్థ్యం' ఉందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. అయితే ఆ వెసులుబాటును చైనా వాడలేదన్నారు. బెలూన్‌ ఉనికిని అమెరికా గుర్తించినప్పటికీ దాని వాడకాన్ని చైనా కొనసాగించింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details