కరోనా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నా, శ్మశానాల ముందు మృతదేహాలతో బారులు తీరుతున్నా.. కఠిన కొవిడ్ నిబంధనల సడలింపునకే చైనా మొగ్గు చూపుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ప్రజాందోళనల కారణంగా ఇటీవల కొవిడ్ ఆంక్షలను సడలించిన చైనా ఆ దిశగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ నుంచి విదేశాల నుంచి చైనా వచ్చే ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని చైనా ప్రకటించింది. ఇకపై చైనాకు వెళ్లేవారు కరోనా నెగిటివ్ ధ్రువపత్రం చూపిస్తే సరిపోతుంది. 48 గంటలకు ముందు ఈ పరీక్ష చేయించుకుని ఉండాలి. కరోనా వెలుగు చూసిన కొత్తలో విదేశాల నుంచి చైనా వచ్చేవారు 14 రోజులు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రంలో ఉండాలని చైనా నిబంధన తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకు దీన్ని 21 రోజులకు పెంచింది. కేసులు తగ్గాక క్వారంటైన్‌ను ఐదు రోజులకు తగ్గించి.. 3 రోజుల పాటు పరిశీలనలో ఉండాలని సూచించింది. తాజాగా క్వారంటైన్ నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది.
ఇక నో క్వారంటైన్.. 'జీరో కొవిడ్'కు దూరంగా చైనా అడుగులు.. ఆంక్షలు ఎత్తివేత
కరోనా కేసుల సునామీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ జీరో కొవిడ్ విధానం నుంచి చైనా క్రమంగా దూరంగా జరుగుతోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు.. వచ్చే నెల 8 నుంచి క్వారంటైన్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. కొవిడ్ మేనేజ్‌మెంట్‌ను క్లాస్ A నుంచి క్లాస్ Bకి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ ప్రకటించింది. తద్వారా కొవిడ్ రోగులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి తప్పనిసరి క్వారంటైన్ సహా కొవిడ్ కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో లాక్‌డౌన్ అవసరం లేకుండా పోయింది.
వచ్చే నెల నుంచి కొవిడ్ మేనేజ్‌మెంట్‌ను క్లాస్ A నుంచి క్లాస్ Bకి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ ప్రకటించింది. డెంగ్యూ జ్వరాన్ని కూడా చైనా ఇదే కేటగిరీలో ఉంచింది. ఇలా కేటగిరీ మార్చడం వల్ల కొవిడ్ రోగులు, వారికి సన్నిహితంగా మెలిగిన వారికి క్వారంటైన్ నిబంధనలు ఇకపై వర్తించవు. కొవిడ్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో గతంలో మాదిరిగా లాక్‌డౌన్ కూడా విధించరు.
రోజువారీ కొవిడ్ కేసులను ప్రకటించడం కూడా చైనా జాతీయ హెల్త్ కమిషన్ ఆదివారం నుంచి నిలిపివేసింది. 2019లో వుహాన్‌లో కొవిడ్-19 వెలుగు చూశాక దాదాపుగా మూడేళ్ల పాటు కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన చైనా ఇప్పుడు వాటి నుంచి పూర్తిగా పక్కకు జరుగుతోంది. వచ్చే ఏడాది చైనాలో కొవిడ్ వల్ల కనీసం 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని నిపుణులు హెచ్చరిస్తున్నా.. జీరో కొవిడ్ నిబంధనల సడలింపునకే చైనా మొగ్గు చూపుతోంది.