తెలంగాణ

telangana

ETV Bharat / international

పెలోసీ పర్యటనతో తైవాన్​ దిగ్బంధనం.. యుద్ధానికి చైనా సై​.. ఏ క్షణమైనా!

China Taiwan War: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌, ఆ దేశ ఉక్కు మహిళ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తైవాన్‌ను జల, వాయు మార్గాల్లో చైనా దిగ్బంధనం చేసిన తీరు చూస్తుంటే తైవాన్‌పై డ్రాగన్‌ యుద్ధానికి దిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తైవాన్​పై చైనా ప్రతీకార చర్యలకు దిగింది. పలు దిగుమతులపై నిషేధం విధించింది.​ ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధమే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విపత్కర పరిణామాలకు దారి తీస్తుందో ఈ కథనంలో చూద్దాం.

Etv BharaChina Taiwan War: China to punish outfits promoting Taiwan independence, bans imports of some Taiwanese food productst
Etv BharatChina Taiwan War: China to punish outfits promoting Taiwan independence, bans imports of some Taiwanese food products

By

Published : Aug 3, 2022, 3:40 PM IST

China Taiwan War: ఇప్పటికే కరోనా సంక్షోభం, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ రెండింటి కారణంగా ఇంధన కొరత, ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక మాంద్యం అంచున వచ్చి కూర్చుంది. ఈ తరుణంలో తైవాన్‌ రూపంలో మరో ముప్పు ముంచుకొస్తోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తైవాన్‌పై చైనా సైనిక చర్యకు దిగితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కంటే కూడా ప్రభావం చాలా రెట్లు ఎక్కువుండే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఇబ్బందులకు కొత్తగా చైనా-తైవాన్‌ యుద్ధం తోడైతే 2008 నాటి ఆర్థిక మాంద్యం పునరావృతం కావడం ఖాయమన్నది నిపుణుల విశ్లేషణ.

రష్యా-ఉక్రెయిన్‌ తరహాలో ఈ వివాదం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాకపోవచ్చు. తైవాన్‌ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే.. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య యుద్ధంగా ఇది పరిణమిస్తుంది. చైనా దాడికి దిగితే క్షిపణులను విస్తృతంగా వినియోగించే అవకాశం ఉంది. దీనివల్ల గగనతలం, సముద్ర మార్గాలు అత్యంత ప్రమాదకరంగా మారి ఆ ప్రభావం సరఫరా వ్యవస్థలపై ఉంటుంది. ప్రపంచంలో మూడొంతుల జలరవాణాకు వేదికగా ఉన్న ఇండో పసిఫిక్‌లోని నౌకా మార్గాలపై ప్రభావం పడుతుంది.

చైనాను కట్టడి చేయడం కోసం అమెరికా ఆర్థిక ఆంక్షల్ని ఆయుధంగా వాడుకొనే అవకాశం ఉంది. చైనా యుద్ధాన్ని మరింత ఖరీదుగా మార్చేందుకు అమెరికా మిత్రదేశాలు సైతం ఆర్థిక ఆంక్షల్ని అమలు చేసే అవకాశం ఉంది. ప్రతిగా చైనా తమ దేశంలో అమెరికా, ఆ దేశ సంస్థల ఆస్తుల్ని తమ అధీనంలోకి తీసుకోవచ్చు. ఇలా యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే అమెరికా జీడీపీలో 5 నుంచి 10 శాతం, చైనా జీడీపీలో 25 నుంచి 35 శాతం కోత పడే అవకాశం ఉందని అంచనా. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలపై ఉండే ఈ ప్రతికూల ప్రభావం ఇతర దేశాలకూ వ్యాపించడం తథ్యంగా కనిపిస్తోంది.

ప్రపంచ సెమీకండక్టర్ల తయారీలో తైవాన్‌ వాటా 30 శాతంగా ఉంది. ఇక అత్యాధునిక సెమీకండక్టర్ల తయారీలోనైతే తైవాన్‌ వాటా ఏకంగా 90 శాతం. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఆటోమొబైల్స్‌ సహా ఇతర డిజిటల్‌ పరికరాల్లో ఉపయోగించే చిన్న, మధ్య శ్రేణి ఎలక్ట్రానిక్‌ చిప్‌లకు ప్రస్తుతం తైవానీస్‌ సెమీకండక్టర్‌ మానుఫ్యాక్చరింగ్‌ సెంటర్‌ ఓ అడ్డా. యాపిల్, క్వాల్‌కామ్‌ వంటి టెక్‌ దిగ్గజాలు సహా అమెరికా మిలిటరీ అవసరాలకు కూడా ఈ కంపెనీ చిప్‌లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీని చైనా అదుపులోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ ఎకానమీపై తీవ్ర ప్రభావం ఉంటుంది.

ప్రపంచ ఆర్థికవ్యవస్థతో చైనా ఏ స్థాయిలో పెనవేసుకుపోయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ కర్మాగారంగా ఉన్న డ్రాగన్‌.. ఉత్పత్తిని ఏమాత్రం తగ్గించినా దాని ప్రభావం పెద్దఎత్తున ఉంటుంది. చాలా దేశాల నుంచి ముడి సరకుల్ని దిగుమతి చేసుకుంటున్న చైనా.. వాటిని నిలిపివేస్తే ఆ ప్రభావం చిన్న దేశాల ఆర్థికవ్యవస్థలను చిదిమేస్తుంది. భారత్‌ సహా ఐరోపా దేశాలు చైనాపై ఏ స్థాయిలో ఆధారపడి ఉన్నాయో కరోనా సంక్షోభం కళ్లకు కట్టింది. చైనా, తైవాన్‌ నుంచి ఎగుమతి, దిగుమతులు పూర్తిగా నిలిచిపోతే ఇటు సెమీకండక్టర్లతో పాటు అటు కీలక కమొడిటీల కొరత తీవ్రంగా ఉండనుంది. అమెరికా, దాని మిత్రదేశాల నౌకాయానాన్ని చైనా లక్ష్యంగా చేసుకుంటే జపాన్‌ ఎగుమతి, దిగుమతులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.

ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలకు ఎంత నష్టమో చైనా ఆర్థిక వ్యవస్థకు అంతకంటే ప్రమాదం పొంచి ఉంది. ఆహార వస్తువులు, చమురు కోసం ఈ దేశం పెద్దఎత్తున దిగుమతులపై ఆధారపడుతోంది. ఆ దేశ జీడీపీలో ఎగమతులదే ప్రధాన వాటా. ఒకవేళ అమెరికా ఆంక్షల్ని అమలు చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకు వస్తే పెద్ద ఎత్తున చైనా ఎగుమతులు నిలిచిపోతాయి. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుంది. ఎఫ్‌డీఐల రూపంలో భారీ మొత్తంలో ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టి లాభాల్ని ఆర్జిస్తున్న చైనా మారక నిల్వల వనరులు దెబ్బతింటాయి. అమెరికా పరికరాలు, విడిభాగాలు లేని చైనా ఉత్పత్తుల కొనుగోలుకు ప్రపంచ దేశాలు విముఖత వ్యక్తం చేయొచ్చు. ఇది విదేశీ మార్కెట్లపై ఆధారపడ్డ చైనా కంపెనీలకు పెద్ద ఎదురు దెబ్బ.

China Bans Taiwan Products:2020లో చైనా చమురు కంటే చిప్‌ల దిగుమతి కోసమే పెద్ద ఎత్తున ఖర్చు చేసింది. తైవాన్‌పై చైనా ఏ స్థాయిలో ఆధారపడుతుందో దీనిని బట్టి తెలుస్తోంది. ఒకవేళ తైవాన్‌ సెమీకండక్టర్ల ఉత్పత్తి నిలిచిపోతే.. చైనాలోని ఎలక్ట్రానిక్స్‌, తయారీ పరిశ్రమలు పూర్తిగా మూతపడతాయి. తైవాన్‌లోని సెమీకండక్టర్ల తయారీ కంపెనీలను ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నించొచ్చు. అంత వరకు వస్తే ఆయా కంపెనీలను పూర్తిగా ధ్వంసం చేయడానికీ వెనుకాడబోమని ఇప్పటికే తైవాన్‌ సంకేతాలిచ్చింది. టీఎస్‌ఎంసీ ఛైర్మన్‌ ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. అక్కడి సిబ్బంది సహకారం లేకుండా చైనా సెమీకండక్టర్ల కంపెనీలను నిర్వహించగలదా అంటే ప్రశ్నార్థకమే.

వన్‌ చైనా విధానానికి ఒప్పుకున్న చాలా దేశాల తరహాలోనే భారత్‌ కూడా తైవాన్‌తో ఎలాంటి అధికారిక దౌత్య సంబంధాలు నెరపడం లేదు. కానీ, 1990ల నాటి నుంచి ఇరు దేశాల మధ్య మంచి మైత్రి కొనసాగుతోంది. భారత్‌లో సెమీకండక్టర్ల పరిశ్రమల స్థాపనకు తైవాన్‌ సహకారం ఎంతో అవసరం. తాజా పరిణామాల వల్ల ఆ ప్రణాళికలు దెబ్బతినే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు భారత్‌.. తైవాన్‌కు మద్దతుగా నిలిస్తే.. ఇప్పటికే చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలు మరింత ముదిరే ప్రమాదం ఉంది. అలాగే చైనాపై పెద్ద ఎత్తున ఆధారపడ్డ కెమికల్‌, ఫార్మా కంపెనీలపై తీవ్ర పభావం పడనుంది.

Pelosi Taiwan Visit: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ.. తైవాన్‌ పర్యటనపై చైనా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలు చేపట్టిన చైనా.. అమెరికా తీరుపై రంకెలేస్తోంది. తాజాగా తైవాన్‌ను.. అష్ట దిగ్బంధనం చేసింది. తైవాన్ గగనతలాన్ని మూసివేసి.. విమాన రాకపోకలు అడ్డుకుంది. తైవాన్‌ సముద్ర మార్గాన్ని దిగ్బంధించింది.

పెలోసీ తైవాన్‌ పర్యటనపై ఆగ్రహంతో రగిలిపోతున్న చైనా ప్రతీకార చర్యలకు దిగింది. 21 చైనా సైనిక విమానాలు తైవాన్‌ ఎయిర్‌డిఫెన్స్‌ జోన్‌లోకి ప్రవేశించి తీవ్ర హెచ్చరికలు జారీచేశాయి. తైవాన్‌కు పది కిలోమీటర్ల సమీపంలోని షామాంగ్‌ నగరంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ భారీ సైనిక వాహనాలను మోహరించింది. తైవాన్‌ జలసంధిలో చేపట్టిన సైనిక విన్యాసాలను తైవాన్ ప్రాదేశిక జలాల్లోకి చైనా విస్తరించింది. తైవాన్‌ గగనతలం, సముద్ర మార్గాలను చైనా మూసివేసింది. చైనా చుట్టూ ఆరు జోన్లలో.. సైనిక కసరత్తులను చేపట్టింది. చైనా నౌకా దళం, వైమానిక దళం, రాకెట్‌ దళం, వ్యూహాత్మక దళాలు, సంయుక్త లాజిస్టిక్‌ బలగాలు కలిసి తైవాన్‌ చుట్టూ భారీగా సంయుక్త విన్యాసాలు చేపట్టాయి. ఈ చర్యలను.. తైవాన్‌ తప్పుబట్టింది. అంతర్జాతీయ చట్టాలను చైనా ఉల్లంఘిస్తోందని, తైవాన్‌ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా తమ ప్రాదేశిక జలాల్లోకి చొచ్చుకొచ్చి సైనిక కసరత్తు చేస్తోందని ఆక్షేపించింది.

China Taiwan Issue: పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా తైవాన్‌ నుంచి ఆహార పదార్థాల దిగుమతులను చైనా నిలిపివేసింది. కొన్ని రకాల పండ్లు, చేపల దిగుమతిని నిషేధించినట్లు తెలిపింది. చైనా నుంచి తైవాన్‌కు.. ఇసుక ఎగుమతులను నిలిపివేసింది. తైవాన్‌కు చెందిన స్పీడ్‌టెక్‌ ఎనర్జీ, హైవెబ్‌ టెక్నాలజీ, స్కైలా, స్కైఐస్‌, జీపీఎస్​ టెక్నాలజీ వంటి సంస్థలతో చైనాకు చెందిన సంస్థలు లావాదేవీలు జరపడంపై నిషేధం విధించింది. ఆయా సంస్థల అధినేతలు చైనా ప్రధాన భూభాగంలోకి రాకుండా చైనా నిషేధించింది. తైవాన్‌కు వాణిజ్యంలో ప్రధాన భాగస్వామిగా చైనానే ఉంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం విలువ 328.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ నేపథ్యంలో తైవాన్‌ ఆర్థిక వనరులు దెబ్బతీసేలా చైనా నిర్ణయం తీసుకుంటోంది.

పెలోసీ పర్యటన నిప్పుతో చెలగాటమేనని మరోసారి హెచ్చరించిన చైనా.. అమెరికాపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. చైనాలోని అమెరికా రాయబారికి సమన్లు జారీచేసింది. ఈ చర్యకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. పెలోసీ పర్యటన భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందని పేర్కొంది. చైనా చేతులు ముడుచుకుని కూర్చోదని మరోసారి తేల్చిచెప్పింది. తైవాన్‌ స్వాతంత్య్రం కోరే శక్తులను నేరపూరిత చర్యలకు జవాబుదారీగా మార్చేందుకు చైనాకు న్యాయపరమైన హక్కులు ఉన్నాయని చైనా అధికార ప్రతినిధి తెలిపారు. చైనా రాజ్యాంగం ప్రకారం తైవాన్‌ తమ భూభాగంలో అంతర్భాగమని పేర్కొన్నారు. చైనా సార్వభౌమత్వం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రత.. ప్రతి చైనా పౌరుడు కోరుకునే అంశమని స్పష్టం చేశారు. దేశాన్ని విభజించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

పెలోసీ పర్యటన చైనాకు ఎలాంటి సంక్షోభం కాదని.. అమెరికా శాంతి వచనాలు పలికింది. చైనా కోపానికి సరైన హేతువులేదని పెంటగాన్‌ అధికార ప్రతినిధి జాన్ కెర్బీ చెప్పారు. తాము ఒకే చైనా విధానానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఐతే బైడెన్ యంత్రాంగం పెలోసీ.. తైవాన్‌ పర్యటన మానుకోవాలని ఆమెకు ఎలాంటి స్పష్టమైన విజ్ఞప్తి చేయలేదని తెలుస్తోంది.

ఇవీ చూడండి:భారత్​పైనా జవహరీ కన్ను.. ఆ వర్గాలను రెచ్చగొట్టాలని చూసి..

సముద్రంలో చైనా సరికొత్త అస్త్రం.. టార్గెట్​ ఆంధ్ర, కేరళ!

చైనా హెచ్చరించినా తైవాన్​లో అడుగుపెట్టిన పెలోసీ.. క్షణక్షణం ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details