అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన రాజేసిన అగ్గి చల్లారక ముందే అమెరికా చట్టసభ్యులు మరోసారి తైవాన్‌లో పర్యటిస్తున్నారు. పెలోసీ పర్యటించి రెండు వారాలు కూడా గడవక ముందే ఐదుగురు సభ్యుల బృందం తైవాన్ పర్యటనకు వచ్చింది. ఆసియా పర్యటనలో ఉన్న సేన్.ఎడ్ మార్కీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ప్రస్తుతం తైవాన్‌లో పర్యటిస్తోంది. తైవాన్‌లోని అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఈ విషయాన్ని వెల్లడించింది.
చైనాకు మరో షాక్, తైవాన్‌కు అమెరికా చట్టసభ్యులు
చైనా, తైవాన్ వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించిన 12 రోజులకే అగ్రరాజ్యానికి చెందిన చట్టసభ్యులు ఆ దేశం వెళ్లడమే ఇందుకు కారణం.
అమెరికా సభ్యుల బృందం తైవాన్ ఉన్నతాధికారులను కలిసి.. అమెరికా -తైవాన్ సంబంధాలు , ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు సహా ఇతర అంశాలపై చర్చిస్తారని తెలిపింది. అమెరికా ప్రభుత్వ విమానంలో తైపీలోని సాంగ్‌షాన్ విమానాశ్రయంలో దిగిన వీడియోను.. తైవాన్ మీడియా విడుదల చేసింది. అయితే అందులో ఎవరున్నారనే దానిపై స్పష్టత లేదు. ఈ వీడియో విడుదలైన కాసేపటికే ఆసియా పర్యటనలో భాగంగా అమెరికా చట్టసభ్యులు తైవాన్‌లో ఆదివారం, సోమవారం పర్యటిస్తారంటూ అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటన విడుదల చేసింది.
నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనపై భగ్గుమన్న చైనా.. తైవాన్ జలసంధిలో సైనిక విన్యాసాలు చేపట్టింది . ఈ పరిస్థితుల్లో 12 రోజుల వ్యవధిలో అమెరికా చట్టసభ్యులు మరోసారి తైవాన్ పర్యటనకు రావటం డ్రాగన్‌కు మరింత కోపం తెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.