China Taiwan attack news : తైవాన్, చైనా మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా తీర ప్రాంతానికి వెలుపల తమ ఔట్‌పోస్టులపై ఎగురుతున్న డ్రాగన్ డ్రోన్లపై తైవాన్ కాల్పులు జరిపింది. కవ్వింపు చర్యలకు దిగితే.. దీటుగా బదులిస్తామనే సంకేతాలను చైనాకు పంపింది. కిన్‌మెన్ ద్వీప సమూహాలపై డ్రోన్లను గుర్తించి.. కాల్పులు జరిపినట్లు తైవాన్ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అవి మానవరహిత డ్రోన్లు అని పేర్కొంది. అయితే డ్రోన్లకు సంబంధించి ఇతర వివరాలు వెల్లడించలేదు. తమ కాల్పుల తర్వాత డ్రాగన్ డ్రోన్లు.. చైనా సిటీ జియామెన్‌కు తిరిగి వెళ్లినట్లు తైవాన్ సైన్యం తెలిపింది.
ఈ నెలారంభంలో సముద్రంలోకి చైనా క్షిపణి దాడులు, తైవాన్ జలసంధి సమీపానికి యుద్ధ విమానాలు, నౌకలు పంపిన తర్వాత ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి సారథ్యంలో ఉన్నత స్థాయి బృందం 25 ఏళ్ల తర్వాత తైవాన్‌లో అడుగుపెట్టగా.. చైనా ప్రతీకార చర్యలకు దిగింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని పేర్కొన్న చైనా.. ఇటీవలి చర్యలు దిగ్బంధం లేదా దండయాత్రకు రిహార్సల్‌గా అభివర్ణించింది. అయితే బీజింగ్ సైనిక విన్యాసాలను అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ తీవ్రంగా ఖండించాయి. చైనా ప్రయోగించిన కొన్ని క్షిపణులు జపాన్ సమీపంలోని ప్రత్యేక ఆర్థిక జోన్ సముద్ర జలాల్లో పడ్డాయి. తమను బెదిరించాలని చైనా జరిపిన సైనిక విన్యాసాలు విఫలమైనట్లు తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది.