China Taiwan Conflict : 103 యుద్ధ విమానాలను తమ దేశం వైపుగా చైనా పంపించిందని ఆరోపించింది తైవాన్. 24 గంటల వ్యవధిలో ఈ విమానాలు తమ భూభాగం వైపు వచ్చినట్లు పేర్కొంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వీటిని గుర్తించినట్లు తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఎప్పటిలాగే అవి తైవాన్ భూతల సరిహద్దు వరకు వచ్చి అనంతరం వెనుదిరిగాయని పేర్కొంది. 40 విమానాలు మాత్రం చైనా, తైవాన్ మధ్య ఉన్న సింబాలిక్ హాఫ్‌వే పాయింట్ దాటాయని తైవాన్ వెల్లడించింది. అంతకు ముందు కూడా తొమ్మిది చైనా నౌకలను తమ సరిహద్దులో గుర్తించినట్లు తైవాన్ తెలిపింది. దీన్ని కవ్వింపు చర్యగా పేర్కొన్న తైవాన్.. చైనాపై మండిపడింది.
జనవరిలో తైనాన్ అధ్యక్ష ఎన్నికలు..
China Taiwan Dispute :జనవరిలో తైనాన్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తైవాన్‌లో అలజడి సృష్టించేందుకే చైనా ఈ చర్యలకు పాల్పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ.
నిత్యం ఉద్రిక్తలతో చైనా తైవాన్ సరిహద్దు..
China Taiwan Controversy :స్వయం పాలిత ద్వీపమైన తైవాన్‌ను తమ భూభాగంగా పేర్కొంటోంది చైనా. బలవంతంగానైనా తమ దేశంలో తైవాన్ కలుపుకుంటామని ఇటీవల ప్రకటించింది. ఈ తరుణంలోనే తైవాన్‌ను భయపెట్టేందుకు గత కొంత కాలంగా చైనా ప్రయత్నాలు చేస్తోంది. తరచూ తైవాన్ వైపు యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను పంపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తైవాన్ సమీపంలో యుద్ధ విన్యాసాలను కూడా చైనా నిర్వహించింది.