చైనాకు చెందిన లూ పెంగ్ యువాన్ యు 028 (LU PENG YUAN YU 028) అనే ఫిషింగ్ నౌక హిందూ మహాసముద్రంలో గల్లంతయ్యింది. ఈ ఓడలో 39 మంది ప్రయాణిస్తున్నారని అధికారులు వెల్లడించారు. గల్లంతైన షిప్ను కనుగొనేందుకు సెర్చ్ ఆపరేషన్ను చేపట్టారు అధికారులు. ఇందులో భాగంగా తక్షణ సాయంగా P8I విమానాన్ని చైనాకు అందించింది భారత నౌకాదళం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ గల్లంతైన వారి ఆచూకీ కోసం P8I విమాన బృందం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మునిగిపోయిన ఓడకు సంబంధించి అనేక వస్తువులను గుర్తించినట్లు ఇండియన్ నేవీ తెలిపింది. భారత్కు సుమారు 900 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న దక్షిణ హిందూ మహాసముద్రం ప్రాంతంలో గుర్తించినట్లు డ్రాగన్ దేశానికి ఇండియన్ నేవీ సమాచారం అందించింది. గల్లంతైన సిబ్బందిలో చైనా సహా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నట్లు సమాచారం.
"హిందూ మహాసముద్రంలో చైనా ఓడకు భద్రతగా విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా భారతదేశం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. భారత నావికాదళం విభాగాలు ఆ ప్రాంతంలోని ఇతర సిబ్బంది సాయంతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను వేగవంతం చేసింది. చైనా నేవీకి చెందిన పలు యుద్ధనౌకలు కూడా ఘటనా స్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటాయి."