China Russia Relations 2022 : రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత దృఢపరచుకొంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శుక్రవారం ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ అంశాన్ని బహిరంగంగా స్పష్టం చేశాక.. నేతలిద్దరూ ఆంతరంగిక చర్చలు చేపట్టారు. గత పది నెలలుగా రష్యా క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై భారీగా విరుచుకుపడుతోంది. గడచిన 24 గంటల్లో రష్యా తమపై 85 క్షిపణులను ప్రయోగించిందని, 35 సార్లు విమానాలతో దాడులు చేసిందని, 63 రాకెట్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ సైన్య ప్రధాన కార్యాలయం తెలిపింది. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున సైతం పలు ఇరానియన్ డ్రోన్లను ప్రయోగించింది. ఈ యుద్ధానికి తెరపడే సూచనలు కనిపించడం లేదు. ప్రాదేశికంగా, రాజకీయంగా ఉద్రిక్తతలు పెరిగి అంతర్జాతీయ వాతావరణం సంక్లిష్టంగా మారిన దృష్ట్యా రష్యా, చైనాలు తమ సహకారాన్ని సుదృఢం చేసుకోవాలని రెండు దేశాల అధినేతలు ఆకాంక్షిస్తున్నారు. అందుకే చైనాతో సైనిక సహకారాన్ని వృద్ధి చేసుకోవాలని పుతిన్ పిలుపునిచ్చారు. వచ్చే వసంతకాలంలో జిన్‌పింగ్ రష్యా పర్యటనకు వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనివల్ల రష్యా, చైనా సంబంధాలు ఎంత పటిష్ఠంగా ఉన్నాయో ప్రపంచానికి తెలుస్తుందన్నారు. రష్యాతో వ్యూహాత్మకంగా పటిష్ఠ బంధాన్ని కోరుతున్నామని జిన్‌పింగ్ సైతం ప్రకటించారు.
జిన్‌పింగ్‌తో పుతిన్ వీడియో కాన్ఫరెన్స్.. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం..! - russia ukraine war
China Russia Relations 2022 : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆంతరంగిక చర్చలు చేపట్టారు. రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత దృఢపరచుకొంటామని ఇరువురు శుక్రవారం ప్రకటించారు.
చైనా విదేశాంగశాఖ తదుపరి మంత్రిగా షిన్‌గాంగ్
తదుపరి విదేశాంగ శాఖ మంత్రిగా అమెరికాలో తమ దేశ రాయబారిగా ఉన్న షిన్ గాంగ్‌ను నియమిస్తున్నట్లు చైనా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దశాబ్ద కాలంగా ఈ పదవిలో ఉన్న వాంగ్ యీ అక్టోబరులో అధికార కమ్యూనిస్టు పార్టీ కీలక విభాగమైన పొలిటికల్ బ్యూరోలో చోటు సంపాదించారు. దీంతో ఆయన విదేశాంగ విధాన రూపకల్పనలో మరింత పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే షిన్ గాంగ్ ఎప్పటి నుంచి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపడతారన్నది తెలియాల్సి ఉంది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు నమ్మకస్థుడని పేరున్న షిన్.. అంతర్జాతీయ వ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరిస్తారు.