స్టెప్ డౌన్ జిన్‌పింగ్.. అన్‌లాక్ చైనా.. నినాదాలతో డ్రాగన్ నగరాలు దద్దరిల్లుతున్నాయి. ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తున్న జీరో కొవిడ్ ఆంక్షలను ధిక్కరిస్తూ.. ప్రజలు చేస్తున్న ఆందోళనలు రాజధాని బీజింగ్‌కు పాకాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో కొవిడ్ బాధితులను బంధించిన భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మరణించడం వల్ల ప్రారంభమైన నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. హాన్ వర్గం చైనీయులు, వీఘర్ ముస్లింలు ఈ ఆందోళనల్లో భారీగా పాల్గొంటున్నారు. జిన్‌పింగ్ వెంటనే దిగిపోవాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నపాటి నిరసనను కూడా ఉక్కుపాదంతో అణిచేసే చైనాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆందోళనలను ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జిన్‌పింగ్‌తో తాడోపేడో తేల్చుకునే పనిలో చైనీయులు- బీబీసీ జర్నలిస్ట్ అరెస్ట్ - చైనా లాక్ డౌన్ లేటెస్ట్ న్యూస్
చైనా ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ కఠిన కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు రాజధాని బీజింగ్‌కు పాకాయి. నెలల తరబడి లాక్‌డౌన్‌లలో మగ్గిపోయిన ప్రజలు స్వేచ్ఛ కావాలంటూ నింగినంటేలా నినదిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టిన చైనీయులు జిన్‌పింగ్ తక్షణం తప్పుకోవాలంటూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. కఠిన నిబంధనల ధిక్కరణకు గుర్తుగా ఖాళీ కాగితాలను చూపిస్తూ వినూత్న నిరసన తెలుపుతున్నారు. వేలమంది పోలీసులను మోహరిస్తున్నా చైనీయులు వెనకడుగు వేయడం లేదు. ఆందోళనల వీడియోలను సెన్సార్ చేస్తున్న చైనా ప్రభుత్వం బీబీసీ జర్నలిస్టుకు సంకెళ్లు వేసి అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది.
చైనాలో అతిపెద్ద నగరమైన షాంఘైలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ప్లకార్డులు చేతపట్టి డ్రాగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. పోలీసులతో యువత బాహాబాహీకి దిగుతున్నారు. ఇప్పటికే చాలా నగరాల్లో ఆందోళనలు తీవ్రమవ్వగా.. ఇప్పుడు నిరసనలు రాజధాని బీజింగ్‌కు పాకాయి. బీజింగ్‌లోని ఒక నది ఒడ్డున కనీసం 400 మంది ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించడం కలకలం రేపింది. "చైనా జాతీయ గీతాన్ని ఆలపిస్తూ.. ప్రజలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. తెల్లవారుజాము వరకు తెల్ల కాగితాలతో ఆందోళన కొనసాగించారని" స్థానికులు తెలిపారు. చెంగ్డూ, షియాన్, వూహాన్ వంటి నగరాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి.
యూనివర్సిటీల్లోనూ విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించవద్దంటూ విద్యార్థులు నినదిస్తున్నారు. చాలా యూనివర్శిటీ క్యాంపస్‌లలో, విద్యార్థులు నిరసన పోస్టర్లను ప్రదర్శించారు. బీజింగ్‌లోని సింఘువా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇటు చైనీయుల ఆందోళనల వీడియోలను డ్రాగన్ ప్రభుత్వం సెన్సార్ చేస్తోంది. ప్రపంచానికి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షాంఘైలో బీబీసీ విలేకరిని సంకెళ్లు వేసి మరీ అరెస్ట్ చేసింది. జర్నలిస్టుపై చైనా అధికారులు వ్యవహరించిన తీరుపై బీబీసీ ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్ట్ ఎడ్ లారెన్స్‌నుచైనా పోలీసులు కొట్టారని వచ్చిన వార్తలపై విస్మయం వ్యక్తం చేసిన బీబీసీ ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.