China Plane Crash: చైనాలో త్రుటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతున్న విమానంలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే, సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 40 మందికిపైగా గాయపడ్డారు. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నింగ్చి ప్రాంతానికి బయల్దేరుతుండగా ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా దిశ మార్చుకుంది. విమానంలో అసాధారణ పరిస్థితులను గుర్తించిన సిబ్బంది వెంటనే టేకాఫ్ కాకుండా నిలిపివేశారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది ఉన్నారు.
మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని వెనుకవైపు ఉన్న అత్యవసర ద్వారం నుంచి నుంచి కిందకు పంపించేశారు. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంటల్లో విమానం కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.