China Nuclear Warheads :చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంది. 2021తో పోలిస్తే వీటి సంఖ్య ఏకంగా 100 పెరిగినట్లు గుర్తించారు. డ్రాగన్ సైన్యంలో జరుగుతున్న అత్యంత కీలకమైన పరిణామాలపై అమెరికాకు చెందిన పెంటగాన్ వార్షిక నివేదికలో ప్రస్తావించింది. దీని ప్రకారం చైనా వద్ద ప్రస్తుతం 500 అణు వార్‌హెడ్‌లు వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి సంఖ్య 2030 నాటికి వెయ్యికి చేరే అవకాశం ఉంది.
ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వద్ద 300 ఖండాంతర క్షిపణులు భూగర్భ బొరియల్లో సిద్ధంగా ఉన్నాయి. దేశంలోని మూడు ప్రదేశాల్లో క్షిపణులు మోహరించడానికి వీలుగా భూగర్భ బొరియలను 2022లో డ్రాగన్ నిర్మించింది. సంప్రదాయ వార్‌హెడ్‌లను ప్రయోగించే ఖండాంతర క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి చైనా ప్రయత్నాలను తీవ్రం చేసింది.
ప్రపంచంలోనే అత్యధికంగా 370 యుద్ధనౌకలు చైనా వద్ద ఉన్నాయి. ఈ సంఖ్య 2025 నాటికి 395కు 2030 నాటికి 435కు పెరగవచ్చు. విదేశాల్లో మిలటరీ బేస్‌లను ఏర్పాటు చేయడానికి డ్రాగన్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మయన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేసియా, యూఏఈ, కెన్యా, నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, పపువా న్యూగినియా, సాల్మన్ ఐలాండ్స్, తజకిస్థాన్ వంటి చోట్ల చైనా లాజిస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. చైనా నౌకాదళంలో ఏడాది కాలంలో 30 సరికొత్త షిప్‌లను వచ్చి చేరాయి.