China New Standard Map Arunachal Pradesh :చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. పొరుగు దేశాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. 2023 సంవత్సరానికి సంబంధించి సోమవారం విడుదల చేసిన స్టాండర్డ్ మ్యాప్‌లో ( China New Map ) భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చూపింది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా డ్రాగన్ పేర్కొంది. ఇప్పటికే భారత్ పలుమార్లు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా చైనా తన తీరును మార్చుకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని పర్వతాలు, నదులు, కొన్ని ప్రాంతాలకు చైనా తమ పేర్లు కూడా పెట్టింది. 2017, 2021లో కూడా చైనా ఇలానే భారత భూభాగాలకు పేర్లు పెట్టింది. అప్పట్లోనే చైనా వైఖరిని తీవ్రంగా ఖండించిన భారత్... పేర్లు పెట్టినంత మాత్రాన వాస్తవ పరిస్థితి మారబోదని స్పష్టం చేసింది. 1962 వరకు కశ్మీర్‌లో భాగంగా ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని యుద్ధంలో చైనా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఇది వివాదాస్పద ప్రాంతంగా ఉంది.
China Map 2023 :దాదాపుగా తమ సరిహద్దు దేశాలు అన్నింటితోనూ చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. తైవాన్, దక్షిణ చైనా సముద్రాలను కూడా తమ దేశంలో అంతర్భాగంగా స్టాండర్డ్ మ్యాప్‌లో చైనా పేర్కొంది. దక్షిణ చైనా సముంద్రంలో అతిపెద్ద భాగంగా ఉన్న నైన్ డ్యాష్ లైన్‌ను కూడా చైనా తమ ప్రాంతంగా మ్యాప్‌లో చూపించింది. దీనిపై వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై దేశాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవల బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కాసేపు మాట్లాడుకున్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఆపరిష్కృతంగా ఉన్న అంశాలపైనే ఇరుదేశాల అధినేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే భారత్-చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని ఈ సందర్భంగా చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రతిష్ఠంభన నెలకొన్న ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ జరగవచ్చని భావిస్తున్నారు. డ్రాగన్ తన కవ్వింపు చర్యలను మాత్రం ఆపడం లేదు.