China Minister Removed :దాదాపు రెండు నెలలుగా కనిపించకుండా పోయిన చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫూను జిన్‌పింగ్ సర్కార్ తొలగించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. షాంగ్‌ఫూ తొలగింపునకు జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొంది. అయితే షాంగ్‌ఫూ ఉద్వాసనకు కారణమేంటన్నది మాత్రం చెప్పలేదు. ఆయన స్థానంలో కొత్తగా ఎవర్ని నియమించిందో కూడా వెల్లడించలేదు. షాంగ్‌ఫూతో పాటు ఆర్థిక మంత్రి లియు కున్ను తొలగించి.. ఆయన స్థానంలో లాన్ ఫోయాన్ను నియమించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వాంగ్ జిగాంగ్‌ను తొలగించి.. ఆయన స్థానంలో యిన్ హెజున్‌ను నియమించినట్లు అధికారికంగా తెలిపింది.
జిన్‌పింగ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి..
China Defence Minister Missing : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పారిశ్రామికవేత్తల నుంచి మంత్రుల వరకు చాలా మంది అకస్మాత్తుగా అదృశ్యమవుతున్నారు. ఈ ఏడాది మే నెలలో అప్పటి చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ ఇలానే అదృశ్యమయ్యారు. అమెరికా మాజీ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ వచ్చినప్పుడు కూడా కిన్ గాంగ్ కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తర్వాత కొన్ని రోజులకు ఆయనను తప్పించి.. విదేశాంగ శాఖ బాధ్యతలను అంతకుముందు నిర్వహించిన వాంగ్ యీకి అప్పగించారు.
ఆ సదస్సు తర్వాత మాయం
China Defence Minister Disappeared :ఆ తర్వాతచైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫూ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. షాంగ్‌ఫూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సన్నిహితుడన్న పేరు ఉంది. 2023 మార్చిలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు షాంగ్‌ఫూ. ఆగస్టు 29న అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న తర్వాత షాంగ్‌ఫూ కనిపించకుండా పోయారు.