తెలంగాణ

telangana

ETV Bharat / international

యుద్ధానికి మేం సిద్ధం.. విదేశాలు అడ్డువస్తే అంతు చూస్తాం : చైనా ​ - china ready to attack taiwan

'జాయింట్‌ స్వోర్డ్‌' పేరుతో తైవాన్‌ చూట్టూ చైనా చేపట్టిన సైనిక విన్యాసాలు ముగిసాయి. ఈ నేపథ్యంలోనే తాము యుద్ధానికి సిద్ధమని చైనా ప్రకటించింది. యుద్ధం ఏ క్షణంలో మొదలైనా పోరాడేందుకు మా బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని వెల్లడించింది.

china-taiwan-drill-china-military-exercises-taiwan-strait-china-taiwan-conflict
యుద్ధానికి సిద్ధమన్న చైనా

By

Published : Apr 11, 2023, 7:16 AM IST

తైవాన్‌ సరిహద్దుల్లో మూడు రోజుల పాటు భీకర సైనిక విన్యాసాలు చేసిన చైనా ఆర్మీ.. యుద్ధానికి సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌ వెన్‌.. అమెరికాలో పర్యటించడంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న చైనా.. తైవాన్‌ సరిహద్దులో ఆర్మీ డ్రిల్స్‌ చేసింది. ఈ యుద్ధ విన్యాసాలు ముగిసిన అనంతరం.. పోరుకు సిద్ధంగా ఉన్నట్లు డ్రాగన్‌ స్పష్టం చేసింది. జాయింట్‌ స్వార్డ్‌ పేరుతో నిర్వహించిన పోరాట విన్యాసాల అనంతరం.. డ్రాగన్‌.. తైవాన్‌తో పాటు ప్రపంచానికి గట్టి హెచ్చరిక పంపింది.

ఏ క్షణంలోనైనా.. ఎలాంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది. తైవాన్‌ స్వాతంత్ర్యం సహా అంతర్గత విషయాల్లో విదేశీ జోక్యం ఏ రూపంలో ఉన్నా.. వాటిని కచ్చితంగా బద్దలకొడతామని పేర్కొంది. ఈ విన్యాసాలు తైవాన్‌ సముద్ర, గగనతలాలను నియంత్రించేందుకు చైనాకు వ్యూహాత్మకంగా దోహదపడతాయని యుద్ధనిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా ఆర్మీ చేసిన ఈ హెచ్చరిక.. డ్రాగన్‌ ఏ క్షణమైనా తైవాన్‌పై యుద్ధానికి దిగవచ్చన్న ఆందోళనలను మరింత పెంచింది.

తైవాన్‌ స్వాతంత్య్రం కోసం జరిగే ప్రయత్నాలతో పాటు అందులో విదేశాల జోక్యాన్ని సహించమని చైనా సైన్యం ప్రకటించింది. తాజాగా జరిగిన విన్యాసాల్లో ఆ దేశం ఎక్కువగా గగనతల పోరాట సామర్థ్యాలపైనే దృష్టి సారించింది. తొలిసారి జె-15 యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ యుద్ద విమానాలు చైనా నౌకాదళానికి చెందిన వాహకనౌకల నుంచి పైకి ఎగిరి తైవాన్‌ గగనతలంలోకి ప్రవేశించాయి. తైవాన్‌ను చుట్టుముట్టి.. దానిపై దాడి చేసే సన్నాహాల్లో భాగంగానే.. డ్రాగన్ వాటిని విన్యాసాల్లో వినియోగించిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

కేవలం 24 గంటల వ్యవధిలోనే 35 యుద్ధవిమానాలు తైవాన్‌ జలసంధిలోని మీడియన్‌ లైన్‌ను దాటినట్లు తెలుస్తోంది. వాటిలో జె-1, జె-16, సు-30 వంటి లోహవిహంగాలు ఉన్నట్లు సమాచారం. తాజా విన్యాసాల్లో షాండాంగ్‌ విమాన వాహకనౌకను కూడా.. పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపయోగించింది చైనా. ఒకవేళ యుద్ధం గనక జరిగితే- తైవాన్‌కు సాయం చేసేందుకు.. విదేశీ సైన్యాలేవీ రాకుండా నిలువరించే ప్రణాళికల్లో భాగంగానే షాండాంగ్‌ సన్నద్ధతను ఆ దేశం పరీక్షించినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు- ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై తైవాన్‌ రక్షణ శాఖ స్పందించింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా, వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే, తాము ఓర్పుతో వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. కొద్ది రోజుల క్రితం తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌ వెన్‌.. అమెరికా హౌస్‌ స్పీకర్‌ మెక్‌ కార్తీతో సమావేశమయ్యారు. తమది స్వయం పాలిత ప్రజాస్వామ్య దేశమని చేసిన ప్రకటించారు. దీంతో డ్రాగన్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దేశాన్ని అన్నివైపుల నుంచి దిగ్బంధిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details