China coup 2022: చైనా అధ్యక్షుడు, శక్తిమంతమైన నేతగా పేరొందిన షి జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారా? పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) అధిపతిగా ఉన్న ఆయన్ని పదవి నుంచి తొలగించారా?.. శనివారం గుప్పుమన్న ఈ వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వార్తను చైనా ప్రభుత్వం గానీ, దేశంలోని విశ్వసనీయ ప్రసార మాధ్యమాలు గానీ, ప్రపంచంలోని పెద్ద మీడియా సంస్థలు గానీ ధ్రువీకరించనప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. పెద్దఎత్తున సైనిక వాహనశ్రేణులు బీజింగ్ చుట్టూ మోహరించినట్లు కొన్ని వీడియో దృశ్యాలు కూడా వ్యాప్తిలోకి వచ్చాయి. దాదాపు 80 కి.మీ. పొడవైన కాన్వాయ్ ఒకటి బీజింగ్ దిశగా వెళ్తున్నట్లు దానిలో ఉంది. సైనాకాధికారి లీ కియావోమింగ్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు అవి చెబుతున్నాయి. అంతేకాదు.. బీజింగ్ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయనీ, బయటి ప్రపంచంతో చైనా రాజధాని నగరానికి సంబంధాలు తెగిపోయాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.
Jinping house arrest: బీజింగ్ నగరం పూర్తిగా సైనిక నియంత్రణలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో, మాజీ ప్రధాని వెన్ జియాబావో కలిసి 'సెంట్రల్ గార్డ్ బ్యూరో' (సీజీబీ) పగ్గాలు చేపట్టాల్సిందిగా స్థాయీ సంఘం మాజీ సభ్యుడు సాంగ్ పింగ్‌ను ఆదేశించారంటూ మరో వార్త వెలుగులోకి వచ్చింది.
అధ్యక్షుడి భద్రత ఏర్పాట్లను చూసేది సీజీబీయే. 'జింటావో, జియాబావోలు సీజీబీని నియంత్రణలో తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని కేంద్ర కమిటీ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపారు. శిఖరాగ్ర సదస్సుకు వెళ్లి, ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్ నుంచి తిరిగి వచ్చిన జిన్‌పింగ్‌ను నిర్బంధించారు. గత పది రోజులుగా సీజీబీ సభ్యులు పలుమార్లు రహస్యంగా సమావేశమయ్యారు. అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే ఈ మంతనాల మర్మం. జిన్‌పింగ్ సమర్కండ్‌లో ఉన్నప్పుడే కుట్ర రూపొందింది. వరసగా మూడోసారి కూడా అధ్యక్షుడిగా కొనసాగాలని ఆయన భావిస్తుండడమే దీనికి కారణం' అనేది ప్రచారంలో ఉన్న సమాచార సారాంశం.
వారికి మరణ శిక్షలే దీనికి దారి తీశాయా?
అవినీతి, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలపై ఇటీవల చైనాలో ఇద్దరు మాజీ మంత్రులకు, మరో మాజీ ఉన్నతాధికారికి మరణ శిక్షలు పడ్డాయి. ఇంకో నలుగురు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు. 2012లో పదవి చేపట్టినప్పటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న జిన్‌పింగ్.. పలువురు అధికారులు, రాజకీయ నేతలకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు.
జిన్‌పింగ్ మారితే మనకి మరింత దెబ్బ:'ఈటీవీ భారత్'తో సుబ్రమణ్యస్వామి
ఏ కారణం చేతనైనా జిన్‌పింగ్‌ను పీఎల్‌ఏ అధిపతి హోదా నుంచి తొలగించి వేరేవారిని తీసుకువస్తే మన దేశానికి మరింత దెబ్బ తప్పదని భాజపా మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాలపై ఆయన శనివారం 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు. "నేరుగా సైనిక జోక్యంతో భారత్‌లోకి మరింత చొచ్చుకు రావాలనేది చైనా సైన్యం యోచన. జిన్‌పింగ్ మాత్రం రాజకీయంగా ముందడుగు వేసేందుకు చూసేవారు. అంచెలంచెలుగా అది జరగాలే గానీ తొందరపడకూడదని ఆయన భావించేవారు. ప్రధాని మోదీ, ఆయన 18 సార్లు సమావేశమయ్యారు. జిన్‌పింగ్‌ను తొలగిస్తే కొత్తగా వచ్చేవారు మన దేశాన్ని మరింతగా శత్రువులా చూస్తారు. ఇంతవరకు మనకు రెండు లెంపకాయలు తగిలితే ఇకపై నాలుగు తగులుతాయి. సైన్యం అభిలాషకు అనుగుణంగా వారు స్పందిస్తారు. ఇప్పటివరకు మనకు జరిగింది ఇకపై రెట్టింపు అవుతుంది" అని చెప్పారు. ప్రజా నాయకుడు కాకుండా సైన్యం నుంచి వచ్చినవారు అధ్యక్షుడైతే మనం యుద్ధానికి సిద్ధపడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.