సూది అవసరం లేకుండానే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంలో మరో ముందడుగు పడింది. నోటి ద్వారా తీసుకునే కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీని చైనా షురూ చేసింది. షాంఘై నగరంలో పంపిణీ చేస్తోన్న ఈ తరహా వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొదటిగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్‌లకు కేవలం ఇంజక్షన్ ద్వారానే తీసుకునే వీలుంది.
'ఈ వ్యాక్సిన్‌లోని ద్రవాన్ని నోటితో పీల్చాల్సి ఉంటుంది. ఐదు సెకన్ల పాటు ఊపిరి తీసుకోవాలి. ప్రక్రియ మొత్తం 20 సెకన్లలోనే ముగుస్తుంది. దీనిని బూస్టర్ డోసుగా పంపిణీ చేస్తున్నాం' అని చైనా అధికారులు వెల్లడించారు. సూదితో వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇష్టపడని వారికి, పేద దేశాలకు ఇది ఎంతో దోహదపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. నోటి ద్వారా తీసుకోవడం వల్ల వైరస్ శ్వాస మార్గాల్లోకి వెళ్లకముందే అంతం చేయవచ్చని చెప్పారు.