Rishi Sunak on China: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న భారత సంతతి నేత రిషి సునాక్ తన ఎన్నికల ప్రచారంలో చైనాపై విరుచుకుపడ్డారు. బ్రిటన్‌తోపాటు యావత్ ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని ధ్వజమెత్తారు. అమెరికా నుంచి భారత్ వరకూ చాలా దేశాలను డ్రాగన్ లక్ష్యంగా చేసుకుందని అనేందుకు ఆధారాలు ఉన్నాయని సునాక్ తెలిపారు.
తాను బ్రిటన్ ప్రధానమంత్రి అయితే చేపట్టే ప్రణాళికలను ఎన్నికల ప్రచారంలో వివరించిన రిషి.. నాటో తరహాలో కొత్త సైనికకూటమిని ఏర్పాటుచేస్తానని ప్రతిపాదించారు. తద్వారా సైబర్ దాడులకు పాల్పడుతున్న చైనాకు కళ్లెం వేస్తామని వివరించారు. సాంకేతిక భద్రతకు సంబంధించిన సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకుంటామని తెలిపారు. బ్రిటన్‌లో చైనా భావజాలాన్ని పెంపొందిస్తున్న 30 చైనా సంస్థలను మూసివేస్తామని ప్రకటించారు. సైబర్ దాడుల ద్వారా బ్రిటన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా దొంగిలిస్తోందని ఆరోపించిన రిషి.. యూనివర్సిటీల్లోకి సైతం డ్రాగన్ చొచ్చుకొస్తోందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను సమర్థిస్తూ తైవాన్‌ను బెదిరిస్తూ పెద్దఎత్తున మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.