India china news: భారత్ చుట్టుపక్కల సైనిక ఉనికిని పెంచుకుంటున్న చైనా.. తన కుయుక్తులను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తన తొలి విదేశీ నౌక స్థావరానికి యుద్ధ నౌకలను తరలించింది. 2016లో 590 మిలియన్ డాలర్ల వ్యయంతో హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో డ్రాగన్ తన తొలి విదేశీ నౌకా స్థావరం నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం అక్కడ యుద్ధనౌకను మోహరించింది. అందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు మీడియాకు అందాయి. హిందూ మహా సముద్రంలో పట్టు బిగించటమే లక్ష్యంగా డ్రాగన్ కుయుక్తులు పన్నుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకంగా భావించే సూయజ్ కాల్వ మార్గంలో ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను వేరు చేసే వ్యూహాత్మక బాబ్-ఎల్-మాండెబ్ జలసంధిలో చైనా నౌకాస్థావరం ఉంది. దీన్ని ప్రత్యక్ష దాడిని తట్టుకునేలా నిర్మించినట్లు సమాచారం.
యుజావో యుద్ధ నౌకను మోహరించినట్లు మాక్సర్ ఉపగ్రహ ఛాయచిత్రాలు చాటుతున్నాయి. ఇది 25 వేల టన్నుల బరువు, 800మంది సైనిక సామర్థ్యం కలిగిన ఈ యుద్ధనౌకపై వాహనాలతోపాటు జెట్ ఫైటర్లను మోహరించవచ్చు. ఇది ట్యాంకులు, ట్రక్కులు, హోవర్ క్రాఫ్ట్‌లను మోయగలదు. ఇటీవలె శ్రీలంకలోని హంబన్‌టోటా ఓడరేవులో 25వేల టన్నుల యువాన్ వాంగ్ యుద్ధనౌకను మోహరించిన చైనా తొలి విదేశీ నౌకా స్థావరంలోనూ కార్యకలాపాలు ప్రారంభినట్లు తెలుస్తోంది.
ఈ యుద్ధనౌక ద్వారా భారత్‌కు సంబంధించిన కీలకమైన ఉపగ్రహ సమాచారాన్ని చైనా ట్రాక్ చేసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో డ్రాగన్ తన యుద్ధనౌకను మోహరించడం ద్వారా సరిహద్దుల్లో నిఘా, ఉగ్రవాద చొరబాట్ల గుర్తింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి భారత నిఘా వ్యవస్థలను డ్రాగన్ పర్యవేక్షించే ప్రమాదం ఉన్నట్లు రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.