India China border : ఒక సారి దెబ్బతింటే.. మరోసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చైనా జాగ్రత్త పడుతోంది. గతంలో డోక్లాం వద్ద భారత్‌తో సైనిక సంక్షోభం తలెత్తాక.. అక్కడ ఏకంగా ఒక గ్రామం, ఇతర నిర్మాణాలను చేపట్టింది. తాజాగా పాంగాంగ్ సరస్సు వద్ద కూడా అటువంటి వ్యూహాన్నే అమలు చేస్తోంది. గతంలో ఇక్కడ చైనా ఈ సరస్సు ఉత్తరం వైపు భారత్ భూభాగాల్లో చొరబడి తిష్ఠ వేయడంతో.. భారత్ సైన్యం మెరుపు వేగంతో ఆపరేషన్ నిర్వహించి దక్షిణం వైపున కైలాశ్ రేంజిలోని కీలక శిఖరాలు స్వాధీనం చేసుకొని మాల్డో గారిసన్‌పై గురిపెట్టింది. దీంతో డ్రాగన్ చర్చల్లో రాజీకొచ్చి ఉత్తరం వైపు భూభాగాలను ఖాళీ చేసింది. భారత్ కూడా కైలాస్ రేంజి నుంచి వెనక్కి తగ్గింది. మరోసారి భారత్ వైపు నుంచి ఇలాంటి మెరుపు ఆపరేషన్లు జరగకుండా చైనా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది.
రాడార్ డోమ్‌ల నిర్మాణం..!
తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు సమీపంలో చైనా దళాల కదలికలు తీవ్రమయ్యాయి. తాజాగా అక్కడ నిఘా కోసం రాడోమ్‌లను నిర్మిస్తోంది. వాతావరణ మార్పుల నుంచి రాడార్లను రక్షించేందుకు నిర్మించే డోము వంటి నిర్మాణాలను రాడోమ్‌లు అంటారు. వివాదాస్పదమైన ఫింగర్-4 నుంచి ఫింగర్-8 మధ్యలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపగ్రహ చిత్ర నిపుణుడు డామియన్ సైమన్ 'డెట్రెస్‌ఫా' పేరిట నిర్వహించే ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. వాతావరణం ఎంత తీవ్రంగా ఉన్నా రాడార్లు ఎలక్ట్రో మాగ్నటిక్ సిగ్నల్స్‌ను రిసీవ్ చేసుకోవడానికి వీలుగా ఈ రాడోమ్‌ల నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం నిర్మిస్తున్న రాడారుతో సరస్సు, దాని చుట్టుపక్కల శిఖరాలపై పూర్తిగా నిఘా పెట్టవచ్చు. ఇక్కడకు సమీపంలోనే సోలార్ ప్యానెళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రాడార్ల సాయంతో సరస్సు పరిసరాల్లో భారత్ దళాల కదలికలపై చైనా నిఘా పెట్టడానికి అవకాశం లభిస్తుంది.