తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో లాక్‌డౌన్‌ దారుణాలు: క్రూరంగా కొవిడ్‌ టెస్టులు.. ఇంట్లోనే బంధిస్తూ..!

కరోనా ఉద్ధృతి ఇప్పటికీ కొనసాగుతున్న వేళ కఠిన లాక్​డౌన్ ఆంక్షలను అమలు చేస్తోంది చైనా. అయితే మహమ్మారి నిర్మూలన పేరుతో దారుణమైన దాడులు, అధికార దుర్వినియోగం వంటి క్రూరమైన చర్యలకు చైనా ప్రభుత్వం పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ పరీక్షల పేరుతో దాడులు చేయడం, బలవంతంగా శాంపిళ్లు తీసుకోవడం సహా ఇళ్లను ఇనుపరాడ్లతో బంధిస్తోన్న ఘటనలపై చైనీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

china covid rules
china covid

By

Published : May 6, 2022, 5:38 AM IST

Updated : May 6, 2022, 6:28 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ చైనా నగరాల్లో మాత్రం దాని ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-జీరో విధానాన్ని అమలు చేస్తోన్న చైనా, పలు నగరాల్లో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో దారుణమైన దాడులు, అధికార దుర్వినియోగం వంటి క్రూరమైన చర్యలకు చైనా ప్రభుత్వం పాల్పడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ పరీక్షల పేరుతో దాడులు చేయడం, బలవంతంగా శాంపిళ్లు తీసుకోవడంతోపాటు ఇళ్లను ఇనుపరాడ్లతో బంధిస్తోన్న ఘటనలపై చైనీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

మహమ్మారి నిర్మూలన పేరుతో చైనా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రశ్నించేవారిపై అతి క్రూరంగా ప్రవర్తిస్తూ, అమానవీయ ఘటనలకు తెగబడుతున్నట్లు అమెరికా వార్తా సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇళ్లు, నివాస ప్రాంగణాల నుంచి బయటకు రాకుండా గేట్లను ఇనుపరాడ్లతో వెల్డింగ్‌ చేస్తున్నట్లు పేర్కొంటున్నాయి. వీటితోపాటు వేల సంఖ్యలో పౌరులను క్వారంటైన్‌ సెంటర్లకు తరలించడం.. పురుషులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు అనే తేడా లేకుండా అందర్నీ ఒకే రూమ్‌లో నిర్బంధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా కొవిడ్‌ కట్టడి పేరుతో తమ ప్రభుత్వం దారుణాలకు పాల్పడుతోందంటూ చైనీయుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

క్రూరంగా కొవిడ్‌ టెస్టులు..

ప్రస్తుతం చైనా అధికారుల తీరును చూస్తుంటే కరోనా వైరస్‌ కంటే లాక్‌డౌన్‌తోనే చైనా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు షాంఘై వంటి నగరాల్లో భారీస్థాయిలో కొవిడ్‌ టెస్టులు జరుపుతోన్న తీరును ఉదహరిస్తున్నారు. కొవిడ్‌ నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించిన ఓ యువతిని బలవంతంగా నేలపై పడేసి శాంపిల్‌ను సేకరిస్తోన్న వీడియో అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. కొవిడ్‌ టెస్టుకు నిరాకరించిన ఓ వృద్ధురాలి కాళ్లను గట్టిగా పట్టుకొని శాంపిళ్లను సేకరించడం మరోవీడియోలో కనిపిస్తోంది. ఇక ఏడుగురు భద్రతా సిబ్బంది ఓ వృద్ధుడి కాళ్లు, చేతులు అదిమిపట్టి నమూనాలు సేకరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇలా షాంఘైతోపాటు పలు చైనా నగరాల్లో కొనసాగుతోన్న ఇటువంటి క్రూరమైన చర్యలకు సంబంధించిన వీడియోలు అక్కడి సోషల్‌ మీడియా యాప్‌ విబోలో వైరల్‌గా మారాయి.

బానిసలు కానివారు మేల్కొండి..!

కరోనా వైరస్‌ కట్టడి పేరుతో చైనా అధికారులు చేస్తోన్న అరాచకాలపై ఇన్నిరోజులు ఓపిక వహించిన చైనీయులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. మూర్ఖపు నిబంధనలతో తమ హక్కులను కాలరాస్తున్నారంటూ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. కొవిడ్‌ నిబంధనలపై కొందరు షాంఘైవాసులు అధికారులను నేరుగా ప్రశ్నిస్తుండగా.. మరికొందరు మాత్రం వీధుల్లోకి వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, అటువంటి వారిని అదుపులోకి తీసుకొని అధికారులు దాడులు చేస్తుండడంపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బానిసలుగా ఉండడానికి నిరాకరించేవారు మేల్కొండి అంటూ వీడియోల ద్వారా చైనా యువత పిలుపునిస్తోంది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చూడండి:'ఆకలి తీరదు.. నిద్ర పట్టదు.. స్నానమూ కష్టమే!'.. చైనా క్వారంటైన్ కేంద్రాల్లో నరకం!!

Last Updated : May 6, 2022, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details