China Corona News: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహమ్మారిని నియంత్రించేందుకు డ్రాగన్ దేశం తలలు పట్టుకుంటోంది. జీరో కొవిడ్ పాలసీ అంటూ ప్రపంచంలో ఏ దేశం అనుసరించని విధానాన్నిఅవలంబిస్తోంది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న షాంఘైలో ఇప్పటికే లాక్‌డౌన్ అమలు చేస్తోంది. పెద్దఎత్తున పరీక్షలు చేస్తోంది. తాజాగా మహమ్మారి కట్టడికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది.
Shanghai Corona Restrictions: కలిసి తినొద్దు.. జంటగా నిద్రించొద్దు.. ముద్దులు, కౌగిలింతలు వద్దేవద్దు.. ఇవీ కరోనా వ్యాప్తిని నిలువరించడానికి చైనా ప్రభుత్వం తాజాగా విధించిన వింత ఆంక్షలు. జంటగా నిద్రించొద్దని, ముద్దులు, కౌగిలింతలకు అనుమతి లేదంటూ షాంఘైలో వీధివీధీ తిరుగుతూ ఆరోగ్యసిబ్బంది మైకులతో ఊదరగొడుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని, స్వేచ్ఛ కావాలన్న కోరికను నియంత్రించుకోవాలని డ్రోన్ల ద్వారా ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలు కాసేపు ప్రశాంతంగా గడిపేందుకు బాల్కనీలోకి వచ్చినా.. డ్రోన్లు ప్రత్యక్షమై లోపలకు వెళ్లాలని హెచ్చరిస్తున్నాయి. ఈ వీడియోను స్థానిక జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.