China Flood 2023 : చైనా హెబీ ప్రావిన్స్‌లో సంభవించిన వరదల్లో 29 మంది మరణించగా.. మరో 16 మంది గల్లంతయ్యారు. ఈ వరదల వల్ల హెబీ ప్రావిన్స్‌లో దాదాపు 95.81 బిలియన్ యువాన్ల భారీ నష్టం వాటిల్లిందని స్థానిక అధికారులు శుక్రవారం మీడియాకు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సహాయక సిబ్బందికి, వరదల్లో మరణించిన పౌరుల కుటుంబాలకు అధికారులు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు.. ఈ వరదలకు దారి తీశాయని హెబీ ప్రావిన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ గవర్నర్ జాంగ్ చెంగ్‌జోంగ్ తెలిపారు. అత్యవసర సహాయ నిధి కింద శుక్రవారం 1.46 బిలియన్ యువాన్లు కేటాయించినట్లు చైనా అర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ నిధులు హెబీ ప్రావిన్స్‌తో సహా బీజింగ్, టియాంజిన్, జిలిన్ హీలాంగ్, జియాంగ్‌కు వర్తిస్తాయి. కాగా ఈ వరద సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి.. కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయం కింద 7.738 బిలియన్ యువాన్లు మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రావిన్స్‌లో వరదలు సంభవించినప్పటి నుంచి పౌరులను రక్షించేందుకు.. అధికారులు రెస్క్యూ టీమ్‌లను అలెర్ట్ చేశారు. సుమారు 17.5 లక్షల మంది ప్రజలను.. సహాయక సిబ్బంది హెబీ ప్రావిన్స్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 9,78,400 మంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారే. అయితే వరద బాధిత పిల్లలను సెప్టెంబర్ 1 తేదీలోగా పాఠశాలకు వెళ్లేలా చూస్తామని అధికారులు అన్నారు. అలాగే శీతాకాలంలోపు నిర్వాసితులు వారి ఇళ్లకు వెళ్లేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రకృతి విపత్తులో దెబ్బతిన్న ప్రాజెక్టులను 2024 వరదల సీజన్‌లోపు.. మిలిగిన అన్ని ప్రాజెక్టులను 2025 నాటికి పునర్ నిర్మిస్తామని అధికారులు స్పష్టం చేశారు.