China Earthquake Today :వాయువ్య చైనాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ విపత్తులో 127మంది ప్రాణాలు కోల్పోయారు. 700మందికి పైగానే గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రకృతి విపత్తుతో గన్సు, కింగ్ హై ప్రావిన్స్‌లలో ఒక్కసారిగా ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయని పేర్కొన్నారు.
రిక్టర్ స్కేల్‌పై 6.2గా భూకంప తీవ్రత
China Earthquake Magnitude :భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదు అయ్యిందని చైనా భూకంప నెట్వర్క్ కేంద్రం తెలిపింది. క్వింఘై ప్రావిన్సులోని సాలా అటానమస్ కౌంటీలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. ఇక ఈ భూకంపం వల్ల జిషిషన్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మంగళవారం మైనస్ 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయినట్లు స్థానిక వాతావరణ అధికారులు తెలిపారు.
విద్యుత్, రవాణా సేవలకు తీవ్ర అంతరాయం
ఈ భూకంపం కారణంగా విద్యుత్, రవాణ, సమాచార మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ సీసీటీవీ తెలిపింది. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు రెస్క్యూ ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిందిగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదేశించినట్లు పేర్కొంది. భూకంపం సంభవించిన ప్రాంతాలకు టెంట్లు, ఫోల్డింగ్ బెడ్ వంటి తదితర అత్యవసర వస్తువులను తరలిస్తున్నట్లు వెల్లడించింది. ప్రావిన్షియల్ ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ 580మంది రెస్క్యూ సిబ్బంది, 88 ఫైర్ ఇంజన్లు, 12 సెర్చ్ అండ్ రెస్క్యూ శునకాలు, 10 వేలకు పైగా వివిధ అత్యవసర పరికరాల సెట్లను విపత్తు ప్రాంతానికి పంపింది. విపత్తు సంభవించిన ప్రాంతంలో ప్యాసింజర్, కార్గో రైళ్లను రైల్వే అథారిటీ సస్పెండ్ చేసింది.